పెనుబల్లి, ఆగస్టు 5 : రాజకీయాల్లో పదవులు ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం మనం చేసిన పనులు, సేవా కార్యక్రమాలే చిరస్థాయిగా నిలుస్తాయని, గుర్తింపును తీసుకొస్తాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. కల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ముఖద్వారాన్ని ప్రారంభించి అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మంగళవారం పదవీ విరమణ చేయనున్న ఎంపీపీ బీరెల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, ఎంపీటీసీలు కలిసి జాతీయ నాయకుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం వారి పనితనానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.