మధిర, ఫిబ్రవరి 26: రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా ఆ శాఖ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. మధిర సమీపంలోని తొండల గోపవరం, బయ్యారం గ్రామాల సమీపంలో కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా ఏర్పాటు చేసిన రెండు రైల్వే అండర్ బ్రిడ్జీలను మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లతతో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడం వల్ల స్థానికంగా రవాణా వ్యవస్థకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రజా రవాణా సౌకర్యం కోసం మూడో ట్రాక్ నిర్మాణం కొనసాగుతోందని అన్నారు. ఇలాంటి అభివృద్ధి పనులు జరగడం మంచి పరిణామమని అన్నారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆకాంక్షించారు. జిల్లాలోని రైల్వే సమస్యలను స్థానిక ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం వల్ల ఈ సమస్యలు పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేశారు. రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు శ్రీనివాస్, లలిత, విద్యాలత, తొగరు వరలక్ష్మి, మేడి కల్యాణి, రంగిశెట్టి కోటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, మల్లికార్జున్‌రెడ్డి, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, వీరారెడ్డి,రావూరి శ్రీనివాసరావు, కోటిరెడ్డి, పింగళ శిరీష తదితరులు పాల్గొన్నారు.
మధిర రూరల్, ఫిబ్రవరి 26: పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ద్వారా మంజూరైన రూ.10 లక్షల నిధులతో మండలంలోని ఇల్లూరు గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్డుకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.