భద్రాద్రి కొత్తగూడెం, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన రూ.లక్షలోపు రుణమాఫీపై భద్రాద్రి జడ్పీ సర్వసభ్య సమావేశంలో రగడ జరిగింది. జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన కొత్తగూడెం క్లబ్లో ఆదివారం జరిగిన సమావేశంలో సభ్యులు రైతు రుణమాఫీపై లెక్కలు చెప్పాలని అధికారులను నిలదీశారు. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు.
మణుగూరు, ఆళ్లపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, చండ్రుగొండ, సుజాతనగర్, బూర్గంపాడు మండలాల్లో చాలామంది రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రేషన్‌కార్డు పేరుతో కొర్రీలు పెట్టి జాబితాలో అర్హుల పేర్లు లేకుండా ఎలా చేశారంటూ ఆళ్లపల్లి ఎంపీపీ మంజుభార్గవి, మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు అధికారులను ప్రశ్నించారు. దీనికి డీఏవో బాబూరావు వివరణ ఇచ్చేందుకు నీళ్లు నమలాల్సి వచ్చింది. ఆయన వద్ద లెక్కలు లేకపోవడంతో రుణమాఫీ అయిన మొత్తం లెక్క చెప్పారు తప్ప అసలు జిల్లావ్యాప్తంగా ఎంతమంది రైతులు రూ.లక్ష రుణం తీసుకున్నారు అనేది చెప్పలేకపోయారు. దీంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో పారిశుధ్యం పడకేయడంతో జనం జ్వరాల బారినపడి చనిపోతున్నా పట్టించుకోరా? అని బీఆర్ఎస్ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు సమస్య రోగులను వేధిస్తున్నదని, మైలారంలో జ్వరాలతో ఇటీవల 8 మంది చనిపోయినా వైద్యశాఖ ఏం చేస్తున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా సభ్యులు తమ మండలాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చి అధికారులను ప్రశ్నించారు. రుణమాఫీ, పారిశుధ్య సమస్య, జ్వరాల విజృంబణపై సభ్యుల ప్రశ్నలతో సమావేశం వాడీవేడిగా సాగింది.
కలెక్టర్ జితేశ్ మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో సాంకేతిక లోపాలు ఉంటే సవరిస్తామని అన్నారు. అర్హులైన వారిని గుర్తించి వారికి వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, రాందాస్‌నాయక్, ఎస్పీ రోహిత్‌రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, సీఈవో చంద్రశేఖర్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
రుణమాఫీపై అధికారుల నోరు విప్పడం లేదు. ఆళ్లపల్లి మండలంలో 1200 మంది రైతులకు రుణమాఫీ రాలేదు. పహాణీలపై గత ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయడం లేదు. సమాధానం చెప్పాలి. పోడు రైతులకూ అన్యాయం జరుగుతోంది.
– మంజు భార్గవి, ఆళ్లపల్లి ఎంపీపీ
చేతకానప్పుడు రుణమాఫీపై కాంగ్రెస్ ఎందుకు హామీ ఇవ్వాలి. మణుగూరు మండలంలో వేల మందికి రుణమాఫీ కాలేదు. సొసైటీ కార్యాలయాలు చుట్టూ రోజూ రైతులు తిరుగుతున్నారు. వ్యవసాయ అధికారులు లెక్కలు లేకుండా మీటింగ్‌కు ఎందుకు వచ్చినట్లు?
– పోశం నరసింహారావు, మణుగూరు జడ్పీటీసీ