ఖమ్మం రూరల్, ఏప్రిల్ 10 : ఈత సరదా ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం గ్రామానికి చెందిన పదో తరగతి పరీక్షలు రాస్తున్న ఐదుగురు విద్యార్థులు స్నేహితుడు పుట్టినరోజు పురస్కరించుకుని గ్రామ సమీపంలోని గొల్లగూడెం సమీపంలోని ఎన్ఎస్పి కాల్వలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈతకు వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో పుట్టబంతి రామకృష్ణ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఉమేష్, వరుణ్ సందేశ్, సందీప్, బాలాజీతో కలిసి ఈతకు వెళ్లిన రామకృష్ణకు ఈత రాకపోవడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు కాల్వ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.