ఇల్లెందు, ఫిబ్రవరి 9: కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వధువు కుటుంబానికి వారి వివాహం జరుగుతున్న రోజే చెక్కు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని కోరారు. రెండెకరాల భూమి ఉండి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న వారి కొందరి దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారని, వారికీ లబ్ధి చేకూర్చాలని కోరారు. ఎమ్మెల్యే వినతికి రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సమాధానమిచ్చారు. కొందరు వివాహం తర్వాత కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, లగ్నపత్రిక అందిన రోజే దరఖాస్తు చేసుకుంటే వివాహ సమయానికి చెక్కు అందుతుందన్నారు.