గడిచిన రెండు సీజన్లుగా నష్టపోతున్న రైతన్నలు.. కొండంత ఆశతో ఈ యాసంగికి సిద్ధమవుతున్నారు. అయితే ఇదైనా సాఫీగా సాగుతుందో లేదోననే ఆందోళన వారిని కలవరపెడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు, ప్రభుత్వ పట్టింపులేనితనం మరోవైపు ఉండి వారిని దిగాలు పెట్టిస్తున్నాయి. ఫలితంగా ఖమ్మం జిల్లాలో సాగు కళ తప్పుతున్నది. గడిచిన పదేళ్లలో జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లో సైతం ప్రకృతి సహకరించడం, ప్రభుత్వం కూడా రైతులకు కొండంత అండగా నిలవడం, అన్నింటా భరోసా కల్పించడం వంటి కారణాలతో ఎవుసం ‘మూడు పువ్వులు – ఆరుకాయలు’ అన్నట్లు సాగింది. దీంతో తెలంగాణకే ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నపూర్ణగా మారింది. అయితే గత యాసంగి నుంచి జిల్లా వ్యవసాయ రంగంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.
-ఖమ్మం, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇప్పటికే ఆయా మండలాల్లో రైతులు యాసంగి సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వానకాలం సాగు చేసిన వరి పొలాలు కోత దశలో ఉన్నప్పటికీ పత్తి పంటను తొలగించి ఆ స్థానంలో రైతులు మక్క సాగు చేపడుతున్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ సొసైటీలకు విత్తనాల పంపిణీని ప్రారంభించింది. ఈ యాసంగి సీజన్లో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం పెసర (ఎంజీజీ-295) 34 క్వింటాళ్లు, ఎంజీజీ-385 23 క్వింటాళ్లు, మినుములు రెండు రకాలు కలిపి 33 క్వింటాళ్లు, శనగ రెండు రకాలు కలిపి 50 కేజీలు, వేరుశనగ 79 క్వింటాళ్లు, వరికి సంబంధించి సన్నాలు, దొడ్డు రకాలు కలిపి 166 క్వింటాళ్లు అవసరం కావచ్చని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుందనే ఆశతో ఈ యాసంగిలో రైతులు భారీగా సన్నరకం సాగు చేసే యోచనలో ఉన్నారు. పత్తి పంటలో పూర్తిగా దిగుబడులు తగ్గడంతో ఒకసారి పంట తీతతోనే అనేక మండలాల్లో రైతులు పంటను తొలగించి మక్క సాగుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు.
జిల్లాలో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో యాసంగిలో రైతులు సాగు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భూగర్భ జలాలతోపాటు చెరువులు, కుంటల్లో సైతం సాగునీరు పుష్కలంగా ఉంది. దీనికి తోడు సాగర్ ఎడమ కాలువ నుంచి సైతం పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం వివిధ రకాల పంటలు కలిపి జిల్లావ్యాప్తంగా 3.16 లక్షల ఎకరాలు సాగు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితి పరిశీలిస్తే.. దాదాపు 4 లక్షల ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా వరి, మక్క పంటలు భారీగా సాగయ్యే అవకాశముంది.
వాటి తర్వాత పెసర, మినుము, మిర్చి తోటల సాగు సైతం జరగనుంది. దీంతో ఎరువులు, డీఏపీ అవసరం చాలా ఉంటుంది. ప్రస్తుతం వానకాలం పంటల కోతలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నారుమడులు సైతం పోసుకుంటున్నారు. వచ్చే నెలలో వరినాట్లు జోరుగా సాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జిల్లాలో ఇతర ఎరువులు నెలకు సరిపడా ఉన్నప్పటికీ డీఏపీ చాలా కొరత ఉందనే వార్తలు వినపడుతున్నాయి. అనేకమంది సొసైటీ బాధ్యులు తమకు డీఏపీ కావాలని కోరుతున్నా ప్రస్తుతం స్టాక్ లేదని సంబంధిత అధికారులు వారికి బదులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా రోడ్డు మార్గాన్నైనా డీఏపీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తేనే రైతులకు అందించే అవకాశం ఉంది.