కడివెడు కష్టాలతో ‘వానకాలాన్ని’ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటున్న కొత్తగూడెం జిల్లా కర్షకులకు ఇప్పుడు యాసంగి సీజన్ మరో పెద్ద గండంగా కన్పిస్తోంది. ఒకవైపు సర్కారు మోసం, మరోవైపు ప్రకృతి ప్రకోపం వంటి కారణాలతో కొట్టుమిట్టాడుతూ వచ్చిన కర్షకులను మున్ముందు మరిన్ని కష్టాలు వెంటాడే ప్రమాదాలు కన్పిస్తున్నాయి. ఈసారి వెయ్యి ఎకరాలకు పైగానే పంటల సాగు విస్తీర్ణం తగ్గే అవకాశముందంటూ సాక్షాత్తూ సర్కారు యాసంగి ప్రణాళికే చెబుతుండడం ఇందుకు అద్దం పడుతోంది.
వానకాలంలో సాగుకు ముందే ఇవ్వాల్సిన రైతుభరోసాను సీజన్ ముగిసినా ఇవ్వకపోవడం, రుణమాఫీని సక్రమంగా చేయకపోవడం, ప్రకృతి విపత్తుల సమయంలో అన్నదాతలను కనీసం ఆదుకోకపోవడం, సన్నాలకు బోనస్ ఇస్తామంటూ చెప్పి మోసం చేయడం, చివరికి కొనుగోలు కేంద్రాలనూ ఏర్పాటుచేయకపోవడం వంటి కారణాలతో అన్నదాతలు యాసంగివైపు మొగ్గు చూపేందుకు జంకుతున్నారు. దీనికితోడు యాసంగికైనా పెట్టుబడి సాయం అందుతుందో లేదోనన్న సందేహాలు వెంటాడుతుండడం, కొన్నిచోట్ల పంటకు సరిపడినన్ని సాగునీళ్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు కూడా తోడవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ వానకాలం సీజన్లో అన్నదాతలు అతలాకుతలమయ్యారు. సీజన్ ప్రారంభంలో సరైన సమయానికి వర్షాలు కురవలేదు. సుమారు రెండు నెలలు ఆలస్యంగా కురిశాయి. దీంతో కాలం ఆ మేరకు వెనుకగా కొనసాగుతోంది. తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి అతిభారీ వర్షాలు ముంచెత్తాయి. కొన్ని చోట్ల పంటలు మొత్తానికి కొట్టుకుపోయాయి. ఎంత నష్టం వాటిల్లినా ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ అందిన పాపానపోలేదు.
కాస్తోకూస్తో బతికిన పంటలు చేతికి రావాలన్నా ప్రస్తుతం కొంతైనా వర్షపాతం ఉండాలి. కానీ ప్రస్తుతం అది కూడా లేదు. దీంతో పొట్టదశలో ఉన్న పంటలు చాలాచోట్ల ఎండిపోతున్నాయి. సీతారామ ప్రాజెక్టుపై గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని కాలువ నుంచి కనీసం చుక్కనీటినైనా అందించలేదు. కొన్నిచోట్ల చెరువులు కూడా అడుగంటుతున్నాయి. ఇక గండి పడిన కారణంగా పెదవాగులో చుక్క నీరు కూడా లేదు. దీంతో దాని ఆయకట్టు కింద ఈ యాసంగి సాగు ప్రశ్నార్థకంగానే కన్పిస్తోంది.
వానకాలం సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన కర్షకులందరినీ రుణమాఫీ పేరిట ముప్పుతిప్పలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. హామీ ఇచ్చినట్లుగానే అందరికీ రుణమాఫీ చేయకపోవడంతో అర్హులందరూ బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. దీంతో పంటలను పట్టించుకునే అవకాశం లేకపోవడంతో పలు చోట్ల పంటలు తెగుళ్ల భారిన పడ్డాయి. అది కూడా అన్నదాతలకే పెద్ద నష్టాన్నే మిగిల్చింది.
మరోవైపు వానకాలం పంటల కోసం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పెద్దగా కదలిక కన్పించడం లేదు. ఇప్పటి వరకూ ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చేసిన దాఖలాలు లేవు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలంటూ ఇటీవలి సమీక్షలో చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ తరువాత దాని ప్రస్తావననే పక్కనపెటేశారు. అంతకుముందు వానకాలం పంటకు బోనస్ విషయంలోనూ అలాగే చేశారు. వీటికితోడు కొన్ని చోట్ల చెరువుల్లో సరిపడినన్ని నీళ్లు లేకపోవడం, బోర్లలో కూడా నీరు ఉంటుందో లేదో అంతుబట్టకపోవడం వంటి కారణాలు కూడా అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో యాసంగిపై వారు వెనక్కు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నిరుటి యాసంగిలో జిల్లాలో 62 వేల ఎకరాల్లో అన్నదాతలు వరి పంటను సాగు చేశారు. అయితే ఈసారి 60,927 ఎకరాల్లోనే వరి సాగుచేసే అవకాశం ఉందంటూ అధికారులు లెక్కలు వేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతులు అంతకంటే తక్కువ విస్తీర్ణంలోనే వరిని సాగు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వరిని 60,927 ఎకరాల్లో, జొన్నను 1,230 ఎకరాల్లో, మొక్కజొన్నను 19,731 ఎకరాల్లో కలిపి మొత్తంగా ఈ యాసంగిలో జిల్లాలో 81, 888 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశమున్నట్లు అధికారులు యాక్షన్‌ప్లాన్ సాగును చేయనున్నారు. దీంతో గత యాసంగితో పోల్చితే ప్రస్తుతం యాసంగిలో పంటల విస్తీర్ణం తగ్గే అవకాశం కన్పిస్తోంది.
ఈ వానకాలం మాలాంటి రైతులను ఎంతో దెబ్బతీసింది. రుణమాఫీల కోసం తిరిగే క్రమంలో మా వరి పంటకు తెగుళ్లు సోకాయి. ఇప్పుడు పంట చేతికొస్తుందా? రాదా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకోవైపు సాగునీరు కూడా సరిపడినంతగా లేదు. పక్కనే గోదావరి ఉన్నా సాగుకు అందే పరిస్థితి లేదు. పంట కాలువలు కూడా లేవు. చెరువులు నిండితే తప్ప నీరు ఉండదు. బోర్ల మీద ఆధారపడిన వారు మాత్రమే వరి పంట వేస్తారు.
-కాసిబోయిన సతీశ్, రైతు, చినబండిరేవు
రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. ఇక పంట వేస్తే ఎవరు చూడాలి? అసలే వర్షాలు, చెరువులు మీద ఆధారపడుతున్న సమయం. ఈ సమయంలో అటు తిరుగుతూ ఇటు పంటలను కాపాడుకోవాలంటే చాలా కష్టమవుతోంది. చివరికి వానకాలం ముగిసినా రైతుభరోసా ఇవ్వలేదు. ఇప్పుడు యాసంగి వేయాలా? వద్దా? అని చూస్తున్నాం. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. అందువల్ల ప్రైవేటులోనే విక్రయిస్తున్నాం.
-లావుడ్యా సత్యనారాయణ, రైతు, సీతంపేట బంజర