భద్రాచలం, మార్చి 14 : ఉమ్మడి జిల్లాలో గిరిజన రైతులు యాసంగి పంటలు సాగు చేస్తున్న దృష్ట్యా వారికి విద్యుత్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ ఆదేశించారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, విద్యుత్ శాఖ ఏడీ, డీఈ, ఏఈ, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్వోఎఫ్ఆర్ ద్వారా పట్టాలు పొందిన గిరిజన రైతుల పంట భూములకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
విద్యుత్, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. అలాగే గిరిజన రైతులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలకు సంబంధించిన ఫైళ్లు ఏమైనా ఉంటే వెంటనే వాటిపై తనకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. గిరిజనులకు సరఫరా చేసే విద్యుత్‌కు ఎవరైనా ఇబ్బందులు, ఆటంకం కలిగించినా వెంటనే తన దృష్టికి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, డీటీఆర్వోఎఫ్ఆర్ శ్రీనివాస్, ఏపీవో(పవర్) మునీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.