ఖమ్మం, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది గుత్తేదారులకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్‌లో స్థానిక కాంట్రాక్టర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేషనల్ వైస్ చైర్మన్ డీవీఎన్ రెడ్డి, రాష్ట్ర చైర్మన్ శ్రీనివాసరావు, కార్యదర్శి పవన్, కోశాధికారి సంతోష్‌రెడ్డి, కిసాన్ శ్రీనివాసరావు, ఖమ్మం సెంటర్ చైర్మన్ కిషోర్‌లు మాట్లాడారు.
గుత్తేదారుల్లో భరోసా కల్పించేందుకు ఈ నెల 18వ తేదీ గురువారం చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వడం జరిగిందని, ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచి కాంట్రాక్టర్లు, సిబ్బంది, ఇతర కార్మికులు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. గత కొద్ది సంవత్సరాలుగా వివిధ శాఖలకు సంబంధించిన కాం ట్రాక్టర్లు బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొద్దిమంది గుత్తేదారులకు మాత్రమే బిల్లులు అందుతున్నాయని, ఆది నుంచి నిర్మాణ పనులు చేసిన వారికి తీవ్ర అన్యా యం జరుగుతున్నదన్నారు. దీంతో గతంలో వందల కోట్లు టర్నోవర్ కలిగిన కాంట్రాక్టర్లు కేవలం 10-20 కోట్ల టర్నోవర్‌కు పడిపోయారన్నారు. తద్వార వారిని నమ్ముకొని జీవనాధారం వెల్లదీస్తున్న వేలాది స్కిల్, నాన్ స్కిల్ కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయని అన్నారు.
ఈ సంక్షోభం వల్ల ఇప్పటికే చాలామంది గుండెపోటుతో మృతిచెందగా, కొం దరు ఆత్మహత్య చేసుకున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లింపు విధానాలను ఇతరులు చూడకుండా వెబ్‌సైట్‌ను సైతం క్లోజ్ చేయడం బాధాకరమన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం బిచ్చగాళ్లలా తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడన్నారు. సమావేశంలో గరికపాటి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సింహారెడ్డి, ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన పలువురు గుత్తేదారులు పాల్గొన్నారు.