పాల్వంచ/ సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 9 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ కార్మికులు బుధవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి చేపట్టిన సమ్మె పాల్వంచ కేటీపీఎస్‌లో గురువారం రెండో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో కార్మికులు బుధవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. గురువారం ఉదయం నుంచి మళ్లీ సమ్మెను యథావిధిగా కొనసాగించారు. అయితే జెన్కో యాజమాన్యం మాత్రం.. కేటీపీఎస్ ప్రాంగణంలోని సీఈల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఆర్టిజన్ కార్మికులు విధుల్లో చేరాలని, లేదంటే టర్మినేట్ చేస్తామని అల్టిమేటం జారీ చేసింది. అయినప్పటికీ కార్మికులు భయపడకుండా తమ సమ్మెను యథావిధిగా కొనసాగించారు. కార్మికుల సమ్మెకు వివిధ పార్టీల నాయకులు, జెన్కోలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ మద్దతు పలికాయి. అలాగే సత్తుపల్లి డివిజన్ కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి చేపట్టిన నిరసన కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ గుగులోతు రాందాస్ మాట్లాడారు.
ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని, పీస్ రేట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్, గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసే కార్మికుల శ్రమను దోపిడీ చేయడం సరికాదన్నారు. ఆయా కార్యక్రమాల్లో సంఘం రాష్ట్ర కన్వీనర్ సాయిలు, కో కన్వీనర్ చంద్రసింగ్ ఠాగూర్, బాలకృష్ణారెడ్డి, వెంపటి అనిల్‌కుమార్, రవీందర్, నర్సిరెడ్డి, వెంకట్రావ్, సాయిబాబా, మసూద్, వెంకటేశ్వర్లు, రమేశ్, శివ యాదవ్, రాజు, శారద, కవిత, నాగేశ్వరరావు, శ్రీను, నర్సింహారావు, కనకదుర్గ. చంద్రకళ, ఆర్టిజన్ కార్మికులు, అన్-మ్యాన్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు పాల్గొన్నారు.
పాల్వంచ, ఏప్రిల్ 9 : తమ సమస్యలపై రెండు రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టిజన్ కార్మికులపై కక్షగట్టిన తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(విద్యుత్ సౌధ, హైదరాబాద్).. కార్మికుల మెడికల్ బిల్లులను నిలిపివేస్తూ గురువారం రాత్రి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత కాపీని టీజీ జెన్కో డైరెక్టర్ ఎస్వీ కుమార్ రాజు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ జనరేషన్ స్టేషన్లకు, జెన్కోలోని అన్ని కార్యాలయాల అధిపతులకు పంపించారు.
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం నుంచి సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్ కార్మికులతోపాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన మెడికల్ క్రెడిట్ కార్డు జారీ, బిల్లుల రీయింబర్స్మెంట్ వంటి అన్ని వైద్య సౌకర్యాలను నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సమ్మెలో లేని ఆర్టిజన్ కార్మికులకు మాత్రమే క్రెడిట్ కార్డు, వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ బిల్లులను పంపాల్సిందిగా అన్ని పవర్ స్టేషన్లలోని కార్యాలయాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇకనుంచి వైద్య క్రెడిట్ కార్డు, వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ పంపే ముందు సంబంధిత స్టేషన్ అధికారులు ఆర్టిజన్ కార్మికులు సమ్మెలో లేరని ధ్రువీకరించుకొని పంపించాలని డైరెక్టర్ ఉత్తర్వుల కాపీలో ఆదేశించారు.