భద్రాచలం, అక్టోబర్ 15 : తమ వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్మికుల ఆకలి కేకలు ఈ సర్కారుకు వినిపించడం లేదా.. అని జేఏసీ, కార్మిక సంఘం నాయకులు ప్రశ్నించారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో గల పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 34వ రోజుకు చేరింది.
సమ్మెలో భాగంగా ఐటీడీఏ ఎదుట చేపట్టిన 72 గంటల ధర్నాకు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గాడిదకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేశ్ మాట్లాడుతూ ఐటీడీఏ ఎదుట చలిలో మహిళా కార్మికులు నిద్రకు ఉపక్రమించినా పట్టించుకోరా.. వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా నిలుస్తామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ప్రజాప్రతినిధులను ఊళ్లలో తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
కాగా.. కార్మికుల ధర్నాకు టీఎన్జీవో డివిజన్ అధ్యక్షుడు డెక నర్సింహారావు, కార్యదర్శి బాలకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి ఎర్రంశెట్టి వెంకటరామారావు మద్దతు పలికారు. సాయంత్రం ధర్నాను విరమించారు. కార్యక్రమంలో జేఏసీ, సీఐటీయూ నాయకులు నాగేశ్వరరావు, హీరాలాల్, గిరి, ఈశ్వర్, మంగీలాల్, జలంధర్, జయ, కౌసల్య, రామకళ, మోహన్, అనంతరాములు, నరసింహారావు, వెంకటేశ్వర్లు, పండ, మంగమ్మ పాల్గొన్నారు.