Gram Panchayat Secretaries | అశ్వారావుపేట, డిసెంబర్ 29: గ్రామాలభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు పనిభారంతో సతమతమవుతున్నారు. రోజువారీ విధులతోపాటు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న సర్వే పనులతో వారు పని ఒత్తిడితో ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు కాకపోవంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఖాళీలు వెంటాడుతుండగా.. ఆపై మరికొన్ని పంచాయతీల్లో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి రావడం మరింత పనిభారాన్ని పెంచుతోంది. వారి మాతృశాఖ విధులతోపాటు మరిన్ని విధులు నిర్వర్తించాల్సి రావడంతో పని ఒత్తిడి అమాంతంగా పెరుగుతోంది.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో మొత్తం 481 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సుమారు 40 పంచాయతీలకు కార్యదర్శులు లేరు. 27 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరు అరకొర వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. అదనపు పని ఒత్తిడికి తోడు కార్యదర్శులు లేని పంచాయతీల బాధ్యతలను అదనంగా మోస్తున్నారు.
గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి పంచాయతీ కార్యదర్శులు ముందుండి పనిచేస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీరు, పచ్చదనం పెంపు, వీధి లైట్ల ఏర్పాటు వంటి మౌలిక సుదపాయాలను ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న కార్యదర్శులు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో నిధులు విడుదల కాక చేతులు ఎత్తేస్తున్నారు. వారి వేతనాలు సర్దుబాటు అయ్యే వరకు సొంత ఖర్చులు వెచ్చిస్తున్నారు. పెద్ద సమస్యలు పరిష్కరించాలంటే బిక్క మొహాలు వేస్తున్నారు. ఇంత పనిభారంతో కొట్టుమిట్టాడుతున్న కార్యదర్శులకు ప్రభుత్వం ఇతర సర్వే విధులు కేటాయించి మరింత పని ఒత్తిడిని పెంచుతోంది. ఫలితంగా ఇంటి పన్నులు వసూళ్ల లాంటి పనులు మూలనపడుతున్నాయి.
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం సహా రోజు వారీ పనులతో గ్రామ కార్యదర్శులు బిజీబిజీగా ఉంటున్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటిరు సరఫరా, వీధి లైట్ల ఏర్పాటు, నర్సరీల్లో మొక్కల పెంపకం, ఇంటి పన్నుల వసూళ్ల బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైనే ఉంది. వీటిని సక్రమంగా నిర్వర్తించడానికే ఆపసోపాలు పడుతున్న కార్యదర్శులపై సర్వే పనులతో ప్రభుత్వం పనిభారం పెంచుతోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో వీరి భాగస్వామ్యం ప్రధానంగా ఉంది. అలాగే పంచాయతీ ఓటర్ల జాబితా తయారీలోనూ వీరిదే కీలకపాత్ర. వీటికి తోడు తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కార్యదర్శుల నెత్తిన పెట్టింది. రోజూ చేసే పనులతో పనిభారం మోస్తున్న కార్యదర్శులకు సర్వే విధులు మరింత పని ఒత్తిడిని పెంచుతున్నాయి.
జిల్లాలోని 481 గ్రామ పంచాయితీల్లో సుమారు 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి బాధ్యతలను ప్రభుత్వం పొరుగు పంచాయతీల కార్యదర్శులకు అదనంగా అప్పగించింది. అలాగే 27 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరి నెల వేతనం కేవలం రూ.15 వేలు మాత్రమే. రెగ్యులర్ కార్యదర్శులతో సమానంగా ఔట్ సోర్సింగ్ కార్యదర్శులు పని చేస్తూ అరకొర వేతనాలతోపాటు పనిభారం మోస్తున్నారు. పైగా వీరికి ప్రభుత్వం సుమారు 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే పని ఒత్తిడితో నలిగిపోతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడదల కాక, వేతనాలు సరిపోక అప్పులు తీసుకొచ్చి మరీ కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులు అందక కార్యదర్శులు అవస్థలు పడుతున్నారు. ఆర్థికపరమైన అంశాలతో కూడిన విధులను నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు అందించేవి. వాటితో కార్యదర్శులు ప్రజా సమస్యలు పరిష్కరించడంతోపాటు పలు అభివృద్ధి పనులు చేపడుతుండేవారు. సర్పంచ్ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 1తో ముగియడంతో అప్పటి నుంచి పాలకవర్గాలు లేవు.
దీంతో ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కావడం లేదు. దీంతో గ్రామ పంచాయతీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఏడాది కాలంలో మే నెల నిధులు మాత్రమే పంచాయతీలకు అందాయి. గ్రామ పంచాయతీలకు ఈజీఎస్, 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వస్తుంటాయి. ప్రస్తుతం ఈ నిధులు ప్రభుత్వాల నుంచి అందడం లేదు. జనరల్ ఫండ్ నుంచి నిధులు వినియోగిస్తున్నారు. ప్రతి నెలా ఇంటి పన్నులు వసూలు చేసి వాటి నుంచి సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారు. మిగిలినవి ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. నిధులు లేని కారణంగా పంచాయతీల కార్యదర్శులు స్థానిక సమస్యలను పరిష్కరించడానికి అనేక తంటాలు పడుతున్నారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి ఉండొచ్చు. కానీ మేము మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే ఇతర సర్వే పనులను వారికి కేటాయిస్తున్నాం. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం వల్ల ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమవుతున్నాయి. అయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
-ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో, అశ్వారావుపేట