ఖమ్మం రూరల్, జూలై 2: ‘అనేకసార్లు ఇండ్ల పట్టాలు తీసుకున్న వారికే మళ్లీ పట్టాలు ఇస్తున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు? ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీలో తమకు అన్యాయం జరిగింది’ అని జలగంనగర్ కాలనీకి చెందిన బాధిత మహిళలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
తీగల వంతెన నిర్మాణంలో భాగంగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి హాజరయ్యారు. తొలుత 42 మంది బాధిత మహిళలకు మంత్రి ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. అనంతరం మంత్రి తిరిగి వెళ్లే సమయంలో జలగంనగర్ కాలనీకి చెందిన మహిళలు మంత్రి పొంగులేటి వద్దకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై గోడు వెళ్లబోసుకున్నారు.
తమ ఇండ్లు కూలగొట్టి పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని అక్కడే ఉన్న ఆర్డీవో నర్సింహారావును మహిళలు చుట్టుముట్టి ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి సర్ది చెప్పినప్పటికీ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత సైతం అధికారుల తీరుపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు.