భద్రాచలం, మే 14 : పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డి.సీతాలక్ష్మి మాట్లాడుతూ పోక్సో కేసు నమోదు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు భగీరథ్‌ను అరెస్టు చేయకుండా, నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
ఇలాంటి కేసుల్లో సామాన్యుల కుటుంబ సభ్యులు ఉంటే వెంటనే అరెస్టు చేసేవారని, మంత్రి కుమారుడు అయినందుకే అరెస్ట్ చేయడం లేదా.. అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు కనక, శ్రీరమణ, రాధ, ఎస్కే చోటిమా, హైమావతి, పద్మ, జి.నాగలక్ష్మి, ఎం.వేగం, ఎస్కే దేవి, కొమరం రుక్మిణి పాల్గొన్నారు.