కొణిజర్ల, నవంబర్ 26: ‘కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా? ఎప్పుడిస్తారు?’ అంటూ వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ను ఓ మహిళ ప్రశ్నించింది. ఈ పరిణామం ఖమ్మం జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ హాజరై లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ లబ్ధిదారురాలి బంధువైన స్థానిక మహిళ చింతల నారాయణమ్మ అక్కడకు చేరుకున్నారు. ‘మీరు అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో తులం బంగారం కూడా ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు కదా? మరి ఎప్పుడు అందజేస్తారు?’ అంటూ ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా కంగుతున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు.. వెంటనే సదరు మహిళను వారించారు. ఇందుకు ఎమ్మెల్యే బదులిస్తూ.. ‘ప్రస్తుతం రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న నేపథ్యంలో బడ్జెట్‌ను అధిగమిస్తూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని అన్నారు. మొదటి ప్రాధాన్యంగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని, త్వరలోనే తులం బంగారం ఇచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాధానమిచ్చారు.