కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 21 : ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎంఎల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కీలక రంగమైన విద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఐఏఎస్ తరహాలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ వ్యవస్థ అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉన్నట్టే ఐఈఎస్ వ్యవస్థ ఉంటే విద్యారంగం పటిష్టం అవుతుందన్నారు. బహుజనుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనను ఆశీర్వదించాలని కోరారు. తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే 317 జీ.వో, సీపీఎస్ విధానం రద్దు, మెరుగైన పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏలన్నీ విడుదల చేయాలన్నారు.
ఈహెచ్ఎస్ అన్ని హాస్పిటల్స్ లో అన్ని రకాల వ్యాధులకు వెంటనే అమలు చేయాలని, కాంట్రాక్టు అధ్యాపకులకు పే స్కేల్ ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న అధ్యాపకులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అన్ని గురుకుల పాఠశాలల్లో పని వేళల్లో హేతుబద్ధీకరణ జరగాలనే అంశాలపై పోరాడి బహుజనుల పక్షాన వాణి వినిపిస్తానని సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్లో 19వ నంబర్‌పై ప్రథమ ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వేల్పుల కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వేణుగోపాల్, యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బసనబోయిన వెంకటేశ్వర్లు, బిక్షపతి , వీరస్వామి, కరేటి శంకర్రావ్, గద్ద సంపత్, ఎం శరత్ తదితరులు పాల్గొన్నారు.