సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 10: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలోని సింగరేణి బొగ్గు తరలింపునకు సంబంధించి నిర్మించిన సైలో బంకర్‌ను తొలగిస్తారా.. లేదంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి పంపించి వేస్తారా.. అంటూ కిష్టారంలోని అంబేద్కర్ నగర్ సైలో బంకర్ బాధితులు తల్లాడ-దేవరపల్లి నేషనల్ హైవేపై సోమవారం రాస్తారోకో చేపట్టారు.
సుమారు 150 కుటుంబాలు ఉన్న కాలనీవాసులు ప్లకార్డులు చేబూని ప్రధాన రహదారిపై బైఠాయించారు. అనంతరం సైలో బంకర్ పక్కనే రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ సైలో బంకర్ ప్రారంభమైన నాటి నుంచి కాలనీ మొత్తాన్ని దుమ్మూదూళితో బూడిదమయం చేశారని, 10 నిమిషాలపాటు బయట కుర్చుంటే ఒంటిమీద బట్టలు కూడా నల్లబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో ఇప్పటికే 10 మందికి పైగా మృతిచెందారని, వందలాది మంది శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారని అన్నారు.
ఇప్పటికే మా భూములు సింగరేణికి ఇచ్చి ఎంతో కోల్పోయామని వాపోయారు. ఇక్కడి ఓసీ ప్రాజెక్టు అధికారి హేళనగా చూడటమేకాక దుమ్మూదూళి ఎక్కడ వస్తుందని మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి సైలో బంకర్‌ను తీసెయ్యాలని, లేదంటే మాకు మరోచోట పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం గ్రామపంచాయతీ, పొల్యూషన్ బోర్డు అధికారుల అనుమతి తీసుకోకుండానే బంకర్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు.
సమస్య పరిష్కారం కానిపక్షంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ దీక్షలతోపాటు పోరాటాన్ని ఉధృతం చేస్తామని దీక్షా శిబిరం నుంచి అంబేద్కర్ నగర్ ప్రజలు సింగరేణి అధికారులను హెచ్చరించారు. ఈ క్రమంలో దీక్షా శిబిరం వద్దకు కిష్టారం సింగరేణి పీవో నరసింహారావు వచ్చి ఎలాంటి ఆవేశానికి గురికావొద్దని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కారమయ్యేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పారు. అయినా ససేమిరా అంటూ ఆందోళన దీక్షలు కొనసాగించారు. కార్యక్రమంలో కాలనీవాసులు మారోజు నాగేశ్వరరావు, కదారి మదీన, పాలకుర్తి నాగేశ్వరరావు, పాలకుర్తి ప్రభుదాస్, వాడపల్లి కోటేశ్వరరావు, కొండా నాగరత్నం, పాలకుర్తి సునీతారాజు, రామాల నాగమణి, రాణి పాల్గొన్నారు.