మణుగూరు టౌన్, జూన్ 24: ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చకుండా రైతులను, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. రైతులకు ఏం మేలు చేశారని వారోత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే ‘రైతుభరోసా’ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భద్రాద్రి జిల్లా రైతులను మోసగించి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీరు అందించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక్కడి బీడు భూముల సస్యశ్యామలం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టును చేపట్టి 90 శాతం నిర్మించారని అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఖమ్మానికి చెందిన ముగ్గురు మంత్రులు భద్రాద్రి జిల్లా రైతాంగానికి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వకుండా వారి ఖమ్మం జిల్లా రైతులకు నీళ్లు తీసుకెళ్తున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా భద్రాద్రి జిల్లా రైతుల తరఫున దశలవారీ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రైతులకు మేలు చేయని రైతు వారోత్సవాలు ఎందుకని రేగా ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండారైతుల నోట్లో మన్ను కొట్టినందుకా?, రెండుసార్లు రైతుభరోసాకు ఎగనామం పెట్టినందుకా; లేకపోతే రైతుబీమాను విస్మరించి రైతులను నిట్టనిలువునా ముంచినందుకా? అంటూ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిస్తే మళ్లీ రైతులను పట్టించుకునే దాఖలాలు ఉండవని ఆరోపించారు. అలాగే, ఇటీవల ఆరుగురు మంత్రులతో కలిసి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి హడావిడిగా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు రెండో పంపుహౌస్‌ను ప్రారంభించారని అన్నారు.
మరి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారని ప్రశ్నించారు? సీతారామ నీళ్లను భద్రాద్రి జిల్లా రైతులకు ఇవ్వకుంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 30న పూసుగూడెం వద్ద సీఎం రేవంత్ చిత్రపటానికి పిండప్రదానం చేస్తూ నిరసన తెలియజేస్తామని అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ శ్రేణులన్నీ కదిలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మణ్, మాజీ జెడ్పీటీసీ పోషం నర్సింహారావు, మాజీ మండల అధ్యక్షుడు అడపా అప్పారావు, యాదగిరిగౌడ్, రాంకోటి, సృజన్, నర్సింహారావు పాల్గొన్నారు.