మధిర, మే 22 : వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యాయి. రైతులు విత్తనాలు, దుక్కులు దున్నేందుకు ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా ఎక్కడని సీపీఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం శీలం నరసింహారావు అధ్యక్షతన పార్టీ మధిర నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు, పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డబ్బులు లేవంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి తమ ఖర్చులు తగ్గించుకున్నారా? ఆడంబరాలు, ప్రభుత్వ అనవసర ఖర్చులు తగ్గించలేదు కాబట్టి రైతులు, కూలీలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కళ్యాణం వెంకటేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. కూలీలకు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దొండపాటి నాగేశ్వరరావు, మందా సైదులు, బట్టు పురుషోత్తం, కిలారి సురేశ్, రాచబంటి రాము, పాపినేని రామనసయ్య పాల్గొన్నారు.