ఖమ్మం, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ‘సంక్షేమ’ రాజ్యాన్ని స్థాపించారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు కాని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
‘దళితబంధు’తో వెలుగులు..
ఎస్సీ కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేస్తున్నది. పథకానికి ఖమ్మం జిల్లా పరిధిలోని చింతకాని మండలం పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైంది. పథకం ద్వారా మండలవ్యాప్తంగా 3,462 కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల విలువైన యూనిట్లు అందాయి. అదే విధంగా జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గ పరిధిలోని ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున 483 కుటుంబాలకు రూ.48.30 కోట్ల విలువైన యూనిట్లు అందాయి. ఇలా జిల్లావ్యాప్తంగా మొత్తం 3,945 కుటుంబాలకు రూ.394 కోట్ల విలువైన యూనిట్లు అందాయి. లబ్ధిదారులు హార్వెస్టర్లు, జేసీబీలు, పొక్లెయిన్లు, డ్రోన్లు, ట్రాక్టర్లు, పాడి గేదెలు, మేకలు, గొర్రెలు, సెంట్రింగ్, డీజే సౌండ్ సిస్టమ్ వంటి యూనిట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు.
మైనారిటీ వర్గాలకు అండగా..
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, పార్సీ, బౌద్ధుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 29,888 మంది విద్యార్థులకు రూ.62.72 కోట్ల ఉపకార వేతనాలు అందించింది. ముఖ్యమంత్రి విదేశీ విద్యానిధి ద్వారా 24 మంది విద్యార్థులకు రూ.4.22 కోట్లు మంజూరు చేసింది. ఎంపవర్మెంట్ పథకం ద్వారా 10 మంది లబ్ధిదారులకు రూ.45 లక్షల విలువైన వాహనాలు పంపిణీ చేసింది. 66 మంది నిరుద్యోగులకు రూ.4.95 లక్షలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. జిల్లా పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల చదువులు, మౌలిక వసతులకు రూ.122 కోట్లు ఖర్చుపెట్టింది. 61,500 మంది లబ్ధిదారులకు రూ 1.12 కోట్ల విలువైన రంజాన్ కానుకలు, 41,000 మంది క్రైస్తవులకు రూ.80 లక్షల విలువైన కానుకలు అందజేసింది. బ్యాంకుల ద్వారా 533 మంది లబ్ధిదారులకు రూ.4.67 కోట్ల సబ్సిడీ రుణాలు ఇచ్చింది. మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా 82 మంది అభ్యర్థులకు రే.8.75లక్షలతో పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించింది. మసీద్‌లు, చర్చీలు, షాదీఖానాల నిర్మాణం, మరమ్మతులకు రూ.2.25 కోట్లు కేటాయించింది.
Khammam
ఎస్టీల అభ్యున్నతి కోసం..
ఎస్టీల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2014-15 నుంచి 2022-23 వరకు 95,423 గిరిజన విద్యార్థులకు రూ.162 కోట్ల ఉపకార వేతనాలు అందించింది. 3,246 మంది లబ్ధిదారుల స్వయం ఉపాధి కోసం రూ.2.37 లక్షల రుణాలు మంజూరు చేశారు. గిరి వికాసం పథకం ద్వారా గిరిజనులకు బోర్లు అందించారు.
బీసీల సంక్షేమానికి భరోసా
వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. 2014-15 నుంచి 2022-23 వరకు 2,20,790 మంది విద్యార్థుల ఉపకార వేతనాలకు రూ.103.99 కోట్లు, 2,09,405 మంది విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ కింద రూ.242 కోట్లు, 42,541 మంది ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు రూ.78.51 కోట్లు వెచ్చించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా పథకం ద్వారా 71 మంది విద్యార్థులకు రూ.11 కోట్లు మంజూరు చేసింది. నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల ఇస్త్రీ దుకాణాలకు పరిమిత యూనిట్ల మేరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఇలా ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.2.85 కోట్లు సబ్సిడీ అందింది.
అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం..
జిల్లావ్యాప్తంగా 2,02,103 మంది కార్మికులు సంక్షేమ బోర్డులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 4,758 మంది కార్మికులకు వివిధ పథకాల ద్వారా రూ.21.09 కోట్ల లబ్ధి చేకూరింది. 6,117 మంది కార్మికుల ఇంట వివాహ వేడుకలకు సర్కార్ రూ.17.06 కోట్ల విలువైన కానుకలు, 14,587 కార్మికుల కుటుంబాలకు ప్రసూతి సాయం కింద రూ.38.17 కోట్లు, సహజ మరణం పొందిన 5,040 మంది కార్మికుల దహన సంస్కారాలకు రూ.55.67 కోట్లు, పలు ప్రమాదాల్లో మరణించిన 382 మంది కార్మికుల దహన సంస్కారాలకు రూ.21.96 కోట్లు, తాత్కాలిక అంగవైకల్యం పొందిన 458 మందికి రూ. 36.14 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన 105 మందికి రూ.1.79 కోట్లు అందించింది.
పేదలకు ‘డబుల్’ ఇండ్లు..
ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నది. 2015-16 నుంచి 2023 వరకు జిల్లాకు 8,956 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 5,626 నిర్మాణాలు పూర్తయ్యాయి. 5,442 మందికి అధికారులు ఇళ్లు అప్పగించారు. వీటితో పాటు ఒక్క ఖమ్మం నగర పరిధిలోనే 1,240 గృహ సముదాయాలను లబ్ధిదారులకు అప్పగించారు.
ఇతర పథకాలు..
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు 2014 నుంచి 2023 వరకు రూ.194.78 కోట్ల ఉపకార వేతనాలు, కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు రూ.3.86 కోట్లు అందించింది. భూమి కొనుగోలు పథకం కింద రూ.15.40 కోట్లు వెచ్చించి 238.16 ఎకరాల భూమిని 90 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. 7,749 మంది స్వయం ఉపాధి కోసం రూ.88.70 కోట్ల సబ్సిడీ రుణాలు అందించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా విద్యార్థులకు రూ.26.49 కోట్ల సాయం చేసింది.