అర్హులందరికీ సంక్షేమ పథకాలు
పిండిప్రోలు రుణం తీర్చుకుంటా
ఎమ్మెల్యే కందాళ సహకారంతో గ్రామాభివృద్ధి
అభినందన సభలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 6: పుట్టిన ఊరు పిండిప్రోలును అభివృద్ధి పథంలో నడిపించి గ్రామం రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హామీ ఇచ్చారు. ఆదివారం గ్రామస్తులు గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. తొలుత టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాయన్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, పింఛన్లు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. పిండిప్రోలులో అంతర్గత రోడ్లను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరావు, టీఆర్ఎస్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, ఎంపీపీ బోడ మంగీలాల్, సొసైటీ చైర్మన్ చావా వేణు, రైతుబంధు సమతి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, నాయకులు చామకూరి రాజు, తాతా విశ్వేశ్వరరావు, సర్పంచ్ రాయల నాగేశ్వరావు, ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.