ఖమ్మం రూరల్, మార్చి 2 : మండలంలోని తీర్థాలలో బుధవారం తెల్లవారుజామున తీర్థాల సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలో శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర దంపతులు కల్యాణమహోత్సంలో పాల్గొన్నారు. అనంతరం ఉదయం తీర్థాలలో శివ, పార్వతుల విగ్రహాలను ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాలు నాయక్, పాలకమండలి చైర్పర్సన్ శాంత గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. రెండో రోజైన బుధవారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఖమ్మం రూరల్, మార్చి 2 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ దంపతులు లక్ష్మీప్రసన్న-సాయికిరణ్ సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు చైర్పర్సన్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
మధిరటౌన్, మార్చి 2 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైరా నది ఒడ్డున ఉన్న శ్రీమృత్యుంజయస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణాన్ని మంగళవారం రాత్రి 12 గంటలకు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అంకుర్పార్పణ, గజారోహణ, హోమం నిర్వహించి శివపార్వతుల కల్యాణాన్ని శివాలయంలో పూజారులు అవధానుల రామకృష్ణ, వెంకటసత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
మధిరటౌన్, మార్చి 2 : పట్టణంలోని మెయిన్‌రోడ్డులోని శ్రీసిద్ధివినాయకస్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా దాతలు మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు దాచేపల్లి ముత్యాలు కుమారుడు ఫణికుమార్, సునీత, సుష్మిత, వైష్ణవ్రాజ్ ఆర్థిక సహకారంతో బుధవారం అన్నదానం నిర్వహించారు.
బోనకల్లు, మార్చి 2 : మండలంలోని చిరునోముల, బోనకల్లు, ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రావినూతల, చిన్నబీరవల్లి, కలకోట, మోటమర్రి, లక్ష్మీపురం గ్రామాల్లో శివపార్వతుల కల్యాణాన్ని మంగళవారం రాత్రి వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. బుధవారం శివపార్వతులను ప్రత్యేక వాహనంపై ఊరేగింపు నిర్వహించారు.
కూసుమంచి, మార్చి 2 : మండలంలోని శివాలయంలో మంగళవారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. కల్యాణాన్ని వేదపండితులు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను ఖమ్మంలోని ప్రముఖ వేద పండితులు వి.సుబ్రహ్మణ్యేశ్వర శర్మ తోపాటు, సాధు నర్సింహారెడ్డి దంపతులు అందజేశారు.
శివాలయంలో ఖమ్మం నాట్యమండలి చిన్నారులు వేసిన పలు నృత్యాలు అబ్బురపరిచాయి. కూసుమంచికి చెందిన రచనా చౌదరి కుండ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. కిష్టాపురానికి చెందిన కోలాట బృందం మాస్టర్ కంచర్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జానపద పాటలకు కోలాటం వేశారు. ఆలయ పునర్నిర్మాణ కర్త, మాజీ డీసీపీ ప్రతాపరెడ్డి, సర్పంచ్ చెన్నా మోహన్, ఈవో శ్రీకాంత్, పూజారి దేవులపల్లి శేషరిగి శర్మ పాల్గొన్నారు.
కూసుమంచి, మార్చి 2 : మండల కేంద్రంలోని శివాలయంలో మహా శివరాత్రి కల్యాణం ఉత్సవ మూర్తులతో బుధవారం నగర సంకీర్తనం చేశారు. కోలాటాలు, భజనలు, మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు.
శివాలయం హుండీ ఆదాయం రూ.2.83 లక్షలు
కూసుమంచి, మార్చి 2 : కూసుమంచిలో మహా శివరాత్రి సందర్భంగా ఆలయంలో హండీ ఆదాయం రూ.2,83,996 వచ్చినట్లు తెలిపారు. బుధవారం హుండీ లెక్కింపును వేణుగోపాలా చారి ఆధ్వర్యంలో చేపట్టారు. సర్పంచ్ చెన్నా మోహన్‌రావు, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, ఈవో శ్రీకాంత్ ఉన్నారు.
నేలకొండపల్లి, మార్చి 2 : మండలంలోని పైనంపల్లిలో శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందాళ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరకింటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్ కొండ్రు విజయలక్ష్మి, ఎంపీటీసీ లక్ష్మయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సీడీసీ చైర్మన్ ఎన్.లీలాప్రసాద్, మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఎన్.సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, ఎ.సైదులు, ఎన్ మల్లికార్జున్, ఎం పద్మారావు, ఎం.వీరబాబు, ఎం లక్ష్మీనారాయణ, టీ సత్యనారాయణ, భాస్కర్‌రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.
చింతకాని, మార్చి 2 : మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శివరాత్రి పురస్కరించుకుని రెండోరోజు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వందనం రామలింగేశ్వర స్వామి వారిని వైరా సీఐ జాటోత్ వసంత్‌కుమార్ దంపతులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. నేరడ, కొదుమూరు, నాగిలిగొండ, వందనం, పందిళ్లపల్లి, లచ్చగూడెం తదితర గ్రామాల్లో ఆలయాల్లో భక్తులతో సందడి వాతావరణం నెలకొన్నది. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్లు, గ్రామ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, రైతుబంధు సమితి సభ్యులు, భక్తులు, యువత పాల్గొన్నారు.