వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ గెలుపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు వేశామని, కమిటీల సారథ్యంలో అందరినీ కలుపుకుపోతూ పనిచేస్తామన్నారు. సీనియర్ నాయకుల సహకారంతో త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో వర్గాలు లేవన్నారు. అంతా టీఆర్ఎస్ వర్గమేనన్నారు. ఉమ్మడి పాలనలో ఏ గ్రామం వెళ్లినా మహిళలు తాగునీటి కోసం బిందెలతో కనిపించేవారని, ఇప్పుడు గ్రామాల్లో ఆ పరిస్థితి లేదన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టు,సీతమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు ఊకంటి గోపాల్రావు, మోరె భాస్కర్రావు, కొట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.