ఖమ్మం, మే 14: ఖమ్మం లోక్‌సభ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పార్టీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని పేర్కొన్నారు. వారు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్కు ఓటు వేశారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీఆర్ఎస్కే మళ్లిందని స్పష్టం చేశారు. మంచి మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం, విశ్వాసం తమకు ఉందని పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఏ గ్రామానికి వెళ్లినా కులమతాలకతీతంగా తనను ఆశీర్వదించి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. కేసీఆర్ రోడ్‌షోకు కూడా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారని అన్నారు. ఓట్లన్నీ నిశ్శబ్దంగా కారు గుర్తుకే ఓటు వేశారని అన్నారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఈ ఆరు నెలల కాలంలో ప్రజలు తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు పడ్డారని, కరెంట్ కోతలను చూశారని అన్నారు. అందుకని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కారు గుర్తుకే పడినట్లు భావిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నామన్నారు. అలాగే తాను విజయం సాధించేందుకు రేయింబవళ్లూ అహర్నిశలూ శ్రమించిన పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, బూత్‌స్థాయి శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపు కుంటున్నానని అన్నారు.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని స్పష్టం చేశారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి నామాకు ఓట్లు వేశారని అన్నారు. అలాగే, పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో పార్టీ అభ్యర్థి నామా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జిల్లాలో పర్యటించి శ్రేణుల్లో ఉత్సాహం నింపిన పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నేత హరీశ్‌రావులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, కూరాకుల నాగభూషణం, బిచ్చాల తిరుమలరావు, పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, బెల్లం వేణుగోపాల్, తాజుద్దీన్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడులు దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు నామా నాగేశ్వరరావు, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అమానుష దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను మంగళవారం వారు పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పార్లమెంటు ఎన్నికల వేళ తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన తమ పార్టీ కార్యకర్తలు బండ్ల రమేశ్, వరిగడ్డి వీరబాబులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని, ఈ దాడిలో రమేశ్, వీరబాబు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ప్రశాంతమైన జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయలను ప్రోత్సహించడం సరికాదని స్పష్టం చేశారు. అనంతరం తమ కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు.