రఘునాథపాలెం/ మామిళ్లగూడెం, మే 20: జిల్లాలో రైతులకు నిబంధనలను పాటిస్తూ విత్తనాలను విక్రయించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విత్తనాల విక్రయం, ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లతో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. రాబోయే సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైతులు పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
వానకాలం సాగుకు అవసరమయ్యే విత్తనాలు ఏ ప్రాంతంలో ఎంత డిమాండ్ ఉంటుందో అంచనా వేసి దానికి అనుగుణంగా అక్కడ విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. జిల్లాలో రైతులంతా ఒకేసారి నాట్లు వేయకుండా, ప్రణాళిక ప్రకారం నాట్లు జరిగేలా చూడాలని, ప్రతి మండలం పరిధిలో ఎప్పడు నాట్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ తయారు చేసుకోవాలని, వరియేతర పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు.
రైతులకు విత్తనాలు అమ్మే సమయంలో నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. విత్తనాల బ్యాగ్‌పై లేబుల్, నిల్వ చివరి గడువు తేదీ మొదలగు వివరాలను స్పష్టంగా తెలియజేసి అమ్మాలన్నారు. జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసిన సమయంలో రికార్డులు అప్డేట్ కాకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ పీ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎంవీ మధుసూదన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వాసవీరాణి, వెంకటేశ్వరరావు, విజయచంద్ర, సరిత, మండల వ్యవసాయ అధికారులు, రిటైలర్లు తదితరులు పాల్గొన్నారు.