సారపాక, మే 8: పట్టణాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. మణుగూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మణుగూరు బస్టాండ్ ఏరియాలో సుమారు రూ.37 లక్షలతో సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులను సోమవారం పరిశీలించిన ఆయన.. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని పైలెట్కాలనీలో అన్ని వార్డుల్లో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ప్రతి వార్డులోనూ డ్రైనేజీలు, అంతర్గత రహదారులు పూర్తయితే ప్రజల ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయినట్లేనని అన్నారు. ఈ పనుల నిమిత్తం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, పనులు కూడా ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. మణుగూరు మున్సిపాలిటీలోని వార్డుల్లో పరిశుభ్రత కోసం పొదలు, పిచ్చిమొక్కల తొలగింపు తదితర పనులను చేపట్టామన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ముత్యం బాబు, అడపా అప్పారావు, కుర్రి నాగేశ్వరరావు, బొలిశెట్టి నవీన్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, జావేద్పాషా, వట్టం రాంబాబు, సురేంద్రపటేల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.