ఖమ్మం, మే 14 : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం నగరంలోని సమస్యలను వెంటనే పరిషరించాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా సీపీఐ కార్యకర్తలు, పోలీసులకు నడుమ తోపులాట జరిగింది. గేట్లు ఎకి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఐ కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నాయకుల జోక్యం పెరిగిందని, అధికార పార్టీ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం ఎంతవరకు సమాంజసమని ప్రశ్నించారు. పట్టణంలో అనేక ఏళ్లుగా రెకల కష్టంపై ఆధారపడి జీవిస్తున్న పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలన్నారు. పింఛన్లు, కొత్త రేషన్‌కార్డులు లేని ప్రజలకు వెంటనే అందించాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎస్కే జానీమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, శింగు నర్సింహారావు, పోటు కళావతి, బిజి క్లెమెంట్, మహ్మద్ సలాం, తోట రామాంజనేయులు, మేకల శ్రీనివాసరావు, నగర సహాయ కార్యదర్శులు పగడాల మల్లేష్, యానాలి సాంబశివరెడ్డి, జిల్లా సమితి సభ్యులు బండి సత్యం, లక్ష్మీనారాయణ, నూనె శశిధర్, ఏనుగు గాంధీ, నర్సింహారావు, కృష్ణమూర్తి, యాకూబ్, రామకృష్ణ, శ్రావణ్, బోడా వీరన్న, చానా, జాకీర్ పాల్గొన్నారు.