‘ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను వంద రోజుల్లో అమలు చేస్తాం.. సంపదను సృష్టించి సబ్బండ వర్గాలకు పంచి, వారు ఆత్మగౌరవంతో బతికేలా పథకాలు అమలు చేస్తాం.. తమ పార్టీ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నాం.. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ప్రతిఒక్కరికీ రూ.10 లక్షల వరకు వర్తింపజేస్తాం.. త్వరలో జిల్లాకు చెందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను అందజేస్తాం.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం..’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతోపాటు రాష్ట్ర వ్యవసాయం, సహకారశాఖ మార్కెటింగ్, చేనేత, జౌళి పరిశ్రమలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. వారికి జిల్లాసరిహద్దు ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మం చేరుకుని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
ఖమ్మం, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను వంద రోజుల్లో అమలు చేస్తామని, సంపదను సృష్టించి ప్రజలకు పంచి, ఆత్మగౌరవంతో బతికేలా పథకాలు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతోపాటు రాష్ట్ర వ్యవసాయం, సహకారశాఖ మార్కెటింగ్, చేనేత జౌళి పరిశ్రమలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారి ఆదివారం ఖమ్మం నగరానికి విచ్చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామన్నారు. తమ పార్టీ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు. గోదావరి జలాలను ఖమ్మం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ప్రతిఒక్కరికీ రూ.10 లక్షల వరకు వర్తింపజేస్తామన్నారు. త్వరలో జిల్లాకు చెందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను అందజేస్తామన్నారు.
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగు జలాలు పారించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కబ్జాల బారిన పడిన రైతుల భూములను వారికే అప్పగిస్తామన్నారు. కబ్జాలు లేని ఖమ్మం జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. పోలీసుల జులుం ఇక ప్రజలపై ఉండదన్నారు.
రాష్ట్ర రెవెన్యూశాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ప్రతి హామీని పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతబంధు సొమ్మును త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.