కారేపల్లి, ఆగస్టు 02 : తాము ఎవరి పత్తి పంట ధ్వంసం చేయలేదని, కావాలనే కొందరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారని బర్మావత్ రాందాస్ అనే వ్యక్తి శనివారం విలేకరుల సమావేశంలో గోడు వెల్లబోశాడు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గోవింద తండా గ్రామానికి చెందిన బర్మావత్ భద్రుకు చెందిన సర్వే నంబర్ 80/1/1/2 లో ఒక ఎకరం భూమి ఉందని తెలిపాడు. తన కుమారుడైన బర్మావత్ వేణు పేరా సర్వే నంబర్ 84, 85లో 1.30 ఎకరాల భూమి ఉందని చెప్పాడు. కాగా తమ భూమిలో సుమారు 15 గుంటల మేర బద్రు కుటుంబం అక్రమంగా పత్తి పంట వేశారని, దీనికి సంబంధించి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు తెలిపాడు. దీంతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, దీనికి సంబంధించి కోర్టుకు సైతం వెళ్లినట్లు వెల్లడించాడు.
చేసేదేమీ లేక మా సొంత భూమిలో ట్రాక్టర్ తో దున్నితే తమ పత్తి పంట ధ్వంసం చేశామని, కిరాయి మనుషులతో కారేపల్లి పోలీస్ స్టేషన్ ముందే దాడికి పాల్పడ్డారన్నారని రాందాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టాదారు పాస్ పుస్తకం, కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్, పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్లు ఉన్నా భద్రు కుటుంబం తమపై దాడికి పాల్పడిందని, తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన కోరాడు.