ఖమ్మం, సెప్టెంబర్ 25: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. ఖమ్మంలోని తన నివాసంలో బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది.
ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ రైతుల అవసరాలకు తగినంత యూరియా అందించకుండా వారి గురించి ముఖ్యమంత్రి, మంత్రులు అవహేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రైతు రుణమాపీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, రూ.4 వేల పింఛన్లు, ఆడపిల్లలకు సూటీలు, కల్యాణలక్ష్మికి తులం బంగారం తదితర ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఇప్పటికీ ప్రజలను మభ్యపెడుతున్నాడని దుయ్యబట్టారు. తాను ఖమ్మాన్ని విడిచి ఎక్కడికీ వెళ్లబోనని మాజీ మంత్రి అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
హామీలు నెరవేర్చలేక నిందలు: ఎంపీ వద్దిరాజు
ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
ప్రతిపక్షాలను బెదిరిస్తూ, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇరత రాష్ర్టాల్లో తిరుగుతూ రాష్ర్టాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు.
తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఖమర్, కర్నాటి కృష్ణ, మక్బుల్, వీరూనాయక్, గుత్తా రవి, మెంతుల శ్రీశైలం, అమరగాని వెంకన్న, బిచ్చాల తిరుమలరావు, హరిప్రసాద్, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం: నామా
కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేందుకు నియోజకవర్గ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలుచేయలేకపోయిందని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందని అన్నారు.