– ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీందర్రావు, తాతా మధుసూదన్
– ఏదులాపురంలో సభాస్థలి పరిశీలన
ఖమ్మం రూరల్, జూన్ 15 : ఈ నెల 17వ తేదీన పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను సూపర్ సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, పాలేరు నియోజకవర్గ అబ్జర్వర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి క్రాస్ రోడ్డు సమీపంలోని శ్రీ హర్ష కన్వెన్షన్ ను వారు పరిశీలించారు. కన్వెన్షన్ మౌలిక వసతులు, పార్కింగ్ ప్రదేశం, భోజన వసతి ఏర్పాట్లు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ప్రారంభం కాబోతున్న ఓటర్ సవరణ విధివిధానాలు, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత నమోదు, పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలు, నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.
ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని, ఈ సమావేశం పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుందన్నారు. ఖమ్మం రూరల్ తిరుమలయపాలెం కూసుమంచి నేలకొండపల్లితో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కార్యకర్తలు సుమారు 2,000 మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణతో మెలిగి నాయకులు ఇచ్చే సందేశాన్ని తిరిగి క్షేత్రస్థాయిలో అమలు పరచాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నేలకొండపల్లి మండల మాజీ ప్రెసిడెంట్ ఉన్న బ్రహ్మయ్య, కూసుమంచి మండలం మాజీ ప్రెసిడెంట్ వేముల వీరయ్య తోపాటు పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు.

‘ఈ 17న జరిగే కేటీఆర్ సమావేశాన్ని విజయవంతం చేయాలి’