బండి చక్రాలు విరిగి మూలనపడ్డాయి.. సట్టాలు సడుగులిరిగి నేలపై వాలాయి.. ఎడ్ల బండ్లు చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలాయి.. ఒకప్పుడు పల్లెకు వెళ్తే కలప ఎడ్ల బండ్లు ఊరి నిండా కనిపించేవి. రైతులు వాటిపై నాగళ్లు, ఎరువుల బస్తాలు, నారు కట్టలు, వంట చెరుకు, పొలాలకు పెంట తరలిస్తూ కనిపించేవాళ్లు. ఇదే బండిపై ఇంటిల్లిపాదీ జాతరకు.. శుభకార్యాలకు వెళ్లేవారు. బండి ఒకవైపు వ్యవసాయానికి దన్నుగా ఉంటూ మరోవైపు రైతుకు రవాణా సాధనంగా ఉపయోగపడేది. ఒకప్పుడు ఎడ్ల బండి ఇంటిముందు ఉంటే ఆ ఇంటికే కళ వచ్చేది. కానీ కాలక్రమేణా ఎడ్ల బండి తన వైభవాన్ని కోల్పోయింది. ఆధునికత రథ చక్రాల కింద నలిగిపోయింది. ఇప్పుడు కూడా ఎడ్ల బండి ఉంది. కానీ అది కలప బండి కాదు.. ఇనుప బండి.. లేదంటే టైరు బండి..! అందుకే అంటుంది పల్లె తల్లి ‘జోడెడ్ల బండి జాడేమైపాయె..’ అని. బతుకునిచ్చిన ఆ ‘బతుకు బండి’పై నేటి ‘నమస్తే’ సండే స్పెషల్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/సారపాక: ‘మమ్మీ.. ఎడ్లబండి అంటే ఏంటి..?’ అని ఓ పిల్లాడి ప్రశ్న. ‘అదే.. నీ టెక్ట్స్బుక్లో బులకార్ట్’ అని అమ్మ సమాధానం. అవునుమరీ ఇప్పుడు ఎక్కడో పల్లెటూరిలో.. అది కూడా ఒకరిద్దరి ఇళ్లలో తప్ప ఇప్పుడెక్కడా ఎడ్లబండి కనిపించడం లేదు. కొందరి ఇళ్లలో మాత్రం ఎడ్ల బండి చక్రాలు శిథిల వస్తువులుగా మిగిలిపోయాయి. అలంకారప్రాయంగా పడి ఉంటున్నాయి. ఇక పట్టణాల సంగతి మాట్లాడనక్కర్లేదు. సరైన రహదారి వసతి, రవాణాకు అంతగా వాహనాలు లేని రోజుల్లో ఈ కాడెద్దుల బండే రవాణా సాధనం. రైతులు పొద్దుగాల సద్దిగట్టుకొని పొలానికి ఈ రథం మీదే వెళ్లేవాడు. ఎరువులు, విత్తనాలు, గ్రాసం.. ఇలా దేన్నైనా ఎడ్లబండి మీదే తరలించేటోడు. నాడు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రం కాబట్టి ఇంటిల్లిపాదీ తీర్థానికి వెళ్లాలంటే ఎడ్లబండే బస్సు, కారు.. అన్నీ. బయల్దేరేముందు బండిని రంగు రంగుల కాగితాలతో అలంకరించేవారు. ఇక బండిపై ప్రభ పెడితే ఆ కళే వేరు. కాకపోతే జాతర రోజుకు కొంచెం ముందుగా బయల్దేరేటోళ్లు. అట్లా బండ్లు ఒకదానెమ్మటి కదులతా ఉంటే ‘బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి..’ అనే యాద్గిరి పాటు గుర్తు రాక మానదు. ఇక ఊరిలో జాతర వచ్చిదంటే గుడి చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన ఉండేది. వేడుక చూడ్డానికి రెండు కళ్లు సరిపోయేవి కావంటే అతిశయోక్తి కాదు. ఒక ఇంట్లో ఎడ్ల బండి, కాడెద్దులు ఉంటే ఆ రైతును మోతబరి అనే వారు. బండి లేని వారు బాడుగకు ఎడ్లబండి తీసుకెళ్లేవారు. అప్పట్లో జాతర సమయంలో ఎడ్లబండ్ల పోటీలకు యమ క్రేజ్ ఉండేది.
వ్యవసాయానికి ప్రాణం..
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో ఎడ్లబండ్లకు ఫుల్ డిమాండ్. సీజన్ ఆరంభంలో పొలాలకు పెంట తరలించడం మొదటి పని. పొలం దున్నేందుకు అవసరమైన నాగళ్లు, గొర్రులను రైతులు ఎడ్లబండిపైనే తరలించేవారు. వడ్లు పట్టించేందుకు మిల్లుకు వెళ్లే సాధనమూ ఎడ్లబండే. ఇంట్లోకి కావాల్సిన వంట చెరుకు, ఆఖరికి ఒక మనిషి చనిపోతే కాలేసేందుకు కావాల్సిన కట్టెలూ ఎడ్లబండి నుంచే వెళ్లాలె. అలాగే పశువుల పాకలు, ఇల్లు కట్టేందుకు అవసరమైన కలప ఎడ్లబండ్లపైనే తెచ్చేది.
వడ్రంగులు, కమ్మరుల ఇంట సందడే సందడి..
వడ్రంగులు కలపతో ఎడ్ల బండి చక్రాలు, బాడీ, కమ్మరులు బండికి అవసరమయ్యే విడి భాగాల తయారు చేసేవారు. వడ్రంగులు, కమ్మరుల పని ప్రదేశాలు హడావుడిగా కనిపించేవి. వచ్చే పోయే రైతులు, బండి పనిచేసే కూలీలతో సందడి సందడిగా దర్శనమిచ్చేవి.
తయారీ ఖర్చు పెరిగింది..
ఎడ్ల బండి తయారీకి అప్పట్లో చాలా తక్కువ అయ్యేది. తయారీకి ఇరుసు, పార్లు, ఖానీ, నొగళ్లు, గొలుసు, సాయిసీలా, పిరాడుబద్ద, బడితెలు, కోలు, వార్నె అవసరమవుతాయి. గతంలో చేతిలో రూ.10 వేలు ఉంటే ఎడ్ల బండి కొనే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అదే ఎడ్లబండికి సుమారు రూ.50 వేల వరకు ఖర్చవుతున్నది. అది కూడా కలప తయారయ్యేవి చాలా తక్కువ. ఇప్పుడు అక్కడక్కడా ఇనుప చక్రాలతో తయారు చేసిన బండ్లు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్ వచ్చి ఎడ్ల బండి మనుగడను తొక్కేసింది. క్రమక్రమంగా ‘కాడెడ్ల కచ్చరం’ కాలంలో కరుగుతున్నది.
నేటి తరానికి తెలుసా..?
ఎడ్ల బండి అంటే అప్పట్లో పిల్లల్లో క్రేజ్ ఉండేది. పెద్దలు ఎడ్లబండిపై పొలానికి వెళ్తున్నప్పుడు పిల్లలు కూడా సరదాగా ఎడ్ల బండి ఎక్కేవారు. ఇప్పటి పల్లెటూరి పిల్లలకు ఎడ్లబండి అంటే ఏమిటో తెలియని పరిస్థితి. ఇక పట్టణాలు, నగరాల్లో ఉండే వారి సంగతి సరేసరి. ఇప్పుడు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న రైతుమేళాల్లో ఎడ్ల బండ్లు దర్శనమిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఊరేగింపుల్లో కనిపిస్తున్నాయి. అవి కూడా ఇనుముతో చేసిన బండ్లే.
జాడలేని జోడెద్దులు..
రైతులకు భూమితోపాటు తాను పెంచుకుంటున్న ఎడ్లపైనా ప్రేమ ఉంటుంది. ఎడ్లను రైతు కుటుంబ సభ్యుల్లా భావిస్తాడు. వాటికి మనుషుల మాదిరిగానే పేర్లు పెట్టుకుంటాడు. ఉదాహరణకు రాముడు, బసవడు.. ఇలా. రైతు వాటితో అప్యాయంగా మాట్లాడుతుంటాడు. ఎడ్లు అనారోగ్యానికి గురైతే తాను బాధపడతాడు. అవి గాయాలపాలైతే తాను కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రమాదవశాత్తు ఎద్దు మృతిచెందితే ఆ ఇంట్లో ఒక మనిషి కాలం చేసిన వాతావరణం కనిపించేది. అలాంటి దృశ్యాలు ఇప్పుడు కనిపించడం చాలా అరుదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎడ్లను పెంచడం రైతులకు కష్టతరంగా మారింది. ఎడ్లకు మేత దొరక్కపోవడం, దాణా ఖర్చులు పెరగడం వంటివి రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.
పాత కాలం పద్ధతులను వదలాల్సి వచ్చింది..
కాలంతో పాటు రైతు కూడా మారాల్సి వచ్చింది. వ్యవసాయంలో కొత్త పద్ధతులు పాటించాల్సిన అవసరం వచ్చింది. పాతరోజుల్లో ఎడ్లతోనే పొలం దున్నించేవాళ్లం. ఎడ్లతోనే దమ్ము చేయించేవాళ్లం. ఇప్పుడు ఎడ్లను పెంచడం కష్టతరం. గ్రాసం సమకూర్చలేక, దాణా ఖర్చులు భరించలేక కొంతకాలం క్రితం మా ఎడ్లను అమ్మేశాను. అమ్మేయడం బాధే. కానీ ఏం చేయగలం?
– బండారి సోమయ్య, రైతు, మోరంపల్లి బంజర
ఆ రోజులు మళ్లీ రావు..
అప్పట్లో ఒక రైతు ఇంటిముందు ఎడ్లు, ఎడ్లబండి ఉంటే ఆ రైతు లక్షాధికారి కింద లెక్క. ఎడ్లు, ఎడ్లబండితోనే పొలం పనులు మొదలయ్యేవి. ఆ రోజులు మళ్లీ రావు. కాలం మారుతున్నా కొద్దీ ఎడ్లబండ్ల సంస్కృతి పోతున్నది. పొలాలు ప్లాట్లలా మారుతున్నాయి. పశువులకు మేత దొరకడం లేదు. వాటిని మేపడం కష్టతరంగా మారింది. దీంతో రైతులు పశువులను అమ్మేసుకుంటున్నారు.
– గుగులోత్ మంగ్యా, రైతు, రూప్లాతండా. సుజాతనగర్ మండలం
ఎడ్లబండి ఇంటికే కళ..
నాడు గ్రామాల్లో ఎడ్లబండ్లు ఎక్కువగా కనిపించేవి. ఎడ్లబండి నిలిపిన ఇంటికి ప్రత్యేక ఆకర్షణ ఉండేది. బండి ఆ ఇంటికి కళ. కనీసం ఒక రైతు కనీసం ఒక పశువునైనా పెంచేటోడు. మేం ఎక్కడికి వెళ్లాలన్నా ఎడ్లబండి మీదే వెళ్లేటోళ్లం. మేము ఎడ్లబండిపై మేడారం వెళ్లిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు అక్కడక్కడా బండ్లు కనిపిస్తున్నాయి. కానీ అవి ఇనుము తయారు చేసిన బండ్లు. కొన్ని టైరు బండ్లు.
– భూక్యా సైదులు, రైతు, బోడు, టేకులపల్లి మండలం