కూసుమంచి, జూలై 31 : నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. దీంతో ఆ నీరు పాలేరు రిజర్వాయర్‌కు శనివారం వరకు వచ్చి చేరనున్నది. ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిని దిగువకు వదలడంతో వేగంగా సాగర్ జలాశయానికి 1.79 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో మరో నాలుగు రోజుల్లో సాగర్ డ్యాం నిండనున్నది.
అయితే జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ కింద 2.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనుండగా.. వానకాలం సాగు కోసం మరో నాలుగైదు రోజుల్లో పాలేరు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. అంతేకాక సాగర్ ఆయకట్టు పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది నీటి కొరతతో పూర్తిస్థాయిలో రైతులు పంటలు వేసుకోలేకపోయారు. వేసిన పంటలు సైతం నీరందక ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో కృష్ణా ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
వానకాలం పంటల సాగుకు నీరు ఇవ్వాలనే ఆలోచనతో అధికారులు యుద్ధప్రాతిపదికన నీటి విడుదల ప్రణాళికను రూపొందిస్తున్నారు. పాలేరు నుంచి కల్లూరు వరకు సాగర్ ఎడమ కాలువ రెండో జోన్ కింద సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనుండగా.. ఆయకట్టు రైతులకు నీటి విడుదలతో తీపి కబురు అందినైట్లెంది.