జూలూరుపాడు, మార్చి 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని రాజారావుపేట పంచాయతీలోని పెద్ద హరిజనవాడకు చెందిన సీతారామచంద్ర స్వామి భక్తులు గ్రామంలో నెల రోజుల పాటు గోటితో ఒలసిన తలంబ్రాలను తలపై పెట్టుకుని మంగళవారం పాదయాత్రగా భద్రాచలం బయల్దేరారు. పెద్ద హరిజనవాడ నుండి పాపకొల్లు, జూలూరుపాడు మీదుగా పడమట నర్సాపురం చేరుకుని సాయంత్రం వరకు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం తిరిగి బయల్దేరి పెద్దమ్మ గుడి దేవాలయం వద్ద బస చేయనున్నట్లు భక్తులు తెలిపారు.
మరుసటి రోజు రామాలయానికి చేరుకుని సీతారామచంద్ర స్వామి దేవాలయ కమిటీవారికి గోటి తలంబ్రాలను అందజేసి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకోనున్నట్లు భక్తులు వెల్లడించారు. మహిళలు, పురుషులు ఒకే రకమైన దుస్తులు ధరించి సీతారామచంద్రస్వామి జెండాలను చేబూని తలపై గోటి తలంబ్రాలు పెట్టుకుని ప్రధాన రహదారి వెంట సీతారామచంద్ర స్వామికి జై అంటూ నినాదాలు చేస్తూ వెళ్తున్నారు. దాంతో రహదారి పక్కన ఉన్న వారితో పాటు ప్రయాణికులు సైతం ఆగి దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేయాలని తమ సంఘీభావం తెలియజేస్తున్నారు.
Goti Talambralu : గోటి తలంబ్రాలతో భద్రాచలానికి పాదయాత్ర