కూసుమంచి, నవంబర్ 9: ఎన్నికల నిర్వహణలో ఓటరుకు బలంగా నిలుస్తున్నాయి సాయుధ బలగాలు. ఓటరు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే సమయంలో అవాంతరాలు, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా, ఓటు వేసే సమయంలో ఆ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినా ఈ సాయుధ బలగాలు రంగంలోకి దిగుతాయి. సమస్యాత్మక గ్రామాల్లోగానీ, మరెక్కడైనా గానీ అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంటే వెంటనే అక్కడ వాలిపోతాయి. ఓటరు తన ఓటు హక్కును స్వేచ్ఛాయుతమైన, ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునేందుకే ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఎలక్షన్ కమిషన్ ఈ సాయుధ బలగాలను నియమిస్తుంది. ఇందులో భాగంగా సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) బలగాలు ఉమ్మడి జిల్లాకు చేరుకున్నాయి. సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మోహరించిన ఈ బలగాలు.. అన్ని గ్రామాల్లోనూ పరేడ్ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ఓటర్లలో ధైర్యాన్ని నింపుతున్నాయి. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాయి.
గతంలో రాజకీయ కక్షలు, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పోలీసులు పోలింగ్ కేంద్రాల వారీగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. సాయుధ బలగాల సహకారంతో అలాంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. సమస్యాత్మక గ్రామాల్లో కవాతులు నిర్వహిండచంతోపాటు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణంలో పూర్తి మార్పులు వచ్చే అవకాశాలున్నట్లు గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో సమస్యాత్మక గ్రామాల సంఖ్య ఈ కింది విధంగా ఉంది.
ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి. ఇందులో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సాయుధ బలగాలు అక్కడ వాలిపోతాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన వేళ ప్రతి గ్రామంలోనూ ఈ బలగాలు కవాతులు నిర్వహిస్తున్నాయి. ఓటర్లకు ధైర్యాన్ని కల్పిస్తున్నాయి. ఓటర్లు కూడా ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదు.
ఎన్నికలనగానే కొన్నిచోట్ల ఘర్షణలు జరుగుతుంటాయి. ఒక్కోసారి అల్లర్లు చెలరేగుతుంటాయి. ఇలాంటివి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడంతోపాటు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. దీంతో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోలేరు. వాటిని నివారించి సామాన్య ఓటర్లలో భయాలు తొలగించేందుకే సాయుధ బలగాలు ఉన్నాయి.