ఖమ్మం రూరల్, మే 10 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేయాలనే స్పష్టతతో ప్రజలు ఉన్నారని, భారీ మెజార్టీతో నామాను గెలిపించుకొని కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సాయిగణేశ్నగర్లో గల కందాల క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కందాల మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు నేను చేస్తున్న రాజకీయం నా కోసం కాదని, పాలేరు బిడ్డల భవిష్యత్, ఈ ప్రాంత అభివృద్ధి కోసమేనని అన్నారు. అయితే మూడు నెలల కాలంలోనే పాలేరు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తిగా అవగాహన కలిగిందన్నారు. పక్షం రోజులుగా ఏ ఊరు వెళ్లినా ప్రజలు మరోసారి మోసపోమని బాధతో చెబుతున్నారన్నారు. ప్రజల వైపు ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈసారి కారు గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు.
కేసీఆర్‌తోనే ఆకుపచ్చ పాలేరు : ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్
గత కేసీఆర్ పాలనలోనే ఆకుపచ్చ నియోజకవర్గంగా పాలేరు తయారైందని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. పదేళ్ల కాలంలో భక్తరామదాసు ప్రాజెక్టు, చెరువుల పూడికతీత, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు ఇలా అనేక పథకాలతో ఆదుకున్నామన్నారు. ఈసారి పాలేరులో కారు గుర్తుకు ఓటేసి ప్రభంజనం సృష్టించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త టీ జీవన్‌కుమార్, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, టీపాలెం మండలాల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, బాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, నాయకులు యండపల్లి వరప్రసాద్, ఇంటూరి శేఖర్, గూడ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.