బోనకల్లు, సెప్టెంబర్ 08 : గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మధిర డివిజన్ కార్యవర్గ సభ్యుడు పాపినేని రామ నర్సయ్య అన్నారు. సోమవారం తూటికుంట్ల గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వీధి లైట్లు లేక రాత్రి సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో పారిశుధ్య సమస్య పేరుకుపోయిందని, రోడ్ల వెంట పిచ్చి మొక్కలు బాగా పెరిగి ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయన్నారు. గ్రామంలో అనేక చోట్ల నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి ప్రజలు జ్వరాల భారిన పడుతున్నట్లు చెప్పారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి సమస్యలపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి బి.సురేశ్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు నోముల పుల్లయ్య, శాఖ కార్యదర్శి పాపినేని వెంకటరావు, మాజీ వార్డు మెంబర్స్ కంచర్ల కృష్ణ , ఫణితి బాలరాజు, శాఖ సభ్యులు గుమ్మ శ్రీనివాసరావు, గుమ్మ వెంకయ్య, పోలేటి సత్యం, సాధినేని ప్రసాద్, కుదురుపాక వెంకటేశ్వర్లు, పెద్ద గోపాల్ రావు, కంకణాల గోపాలరావు పాల్గొన్నారు.