పెనుబల్లి, అక్టోబర్ 16: అనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారని ఆరోపిస్తూ ఏరుగంట్ల గ్రామంలో గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. ఇండ్ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన వారికి ఇండ్లు ఇవ్వకుండా అనర్హులకు ఎలా కేటాయిస్తారని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో 40 డబుల్ బెడ్రూ ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో జూలై నెలలో గ్రామసభ నిర్వహించి 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
వారి పేర్లను కలెక్టర్‌కు పంపించారు. ఇందులో ఇండ్ల నిర్మాణానికి తమ సొంత స్థలాలు ఇచ్చామని, అయినా తమకు అన్యాయం జరిగిందని 15 మంది హైకోర్టుకు వెళ్లారు. దీంతో స్థలాలు ఇచ్చిన వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఐదుగురికి మాత్రమే ఇండ్లు కేటాయించి, 10 మందిని అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందంటూ వారు డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్థలాలు ఇచ్చిన వారికి ఇండ్లు కేటాయించాల్సిందేనని తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పటివరకు ఇండ్లు ఎవరికీ కేటాయించలేదని, ఇచ్చిన వారి పేర్లను మళ్లీ పరిశీలించి కలెక్టర్‌కు నివేదిస్తామని తహసీల్దార్ తెలపడంతో ఆందోళన విరమించారు.