భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు బంజార కాలనీలో తాగునీటి కోసం గ్రామస్తులు తండ్లాడుతున్నారు. చాలాయేండ్లుగా అదే పరిస్థితి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పాల్వంచ మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ బంజార కాలనీలో 75 కుటుంబాల వారు నివాసముంటున్నారు. ఊరు మొత్తంలో పనిచేసే ఒకే ఒక చేతిపంపు ఉంది. అందులోనూ నీరు అరకొరగానే వస్తుంటాయి. దీంతో గ్రామస్తులకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఇక వేసవిలో అయితే బాధలు వర్ణనాతీతం. పక్కనే ఉన్న పునుకుల గ్రామానికి వెళ్లి తాగునీరు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఆ గ్రామస్తులది.
జిల్లా అంతటా మిషన్ భగీరథ పైపులైన్ వేసినా అక్కడ మాత్రం లేకపోవడంతో గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా తాగునీటి కష్టాలు పడుతున్నారు. ఇక ఆ గ్రామానికి భగీరథ నీరు రాదని వారు నిర్ణయానికొచ్చారు. మరి వేరే నీరన్నా అందిస్తారా.. అంటే అదీ లేదు. అధికారులు వచ్చి హడావుడి చేయడం తప్ప వారి సమస్యకు మోక్షం లభించడం లేదు. ఇటీవల కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి అవాక్కయ్యారు. నీటి సమస్యను ఇంతకాలం పై అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు భగీరథ పైపులైన్ వేయడానికి రైల్వే అధికారులు అభ్యంతరం తెలిపారని చెప్పారు. వీలైనంత త్వరగా పైపులైన్ వేయాలని ఆ అధికారి ఆదేశించడంతో సమస్య కొలిక్కి వస్తుందని గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రస్తుతం పైసలిచ్చి నీళ్లు కొనుగోలు చేసుకునే గ్రామం ఉందంటే అది కరకవాగు బంజార కాలనీ అని చెప్పక తప్పదు. వాటర్ టిన్ను పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
చాలాకాలం నుంచి మా గ్రామంలో నీటి సమస్య ఉంది. అధికారులు పట్టించుకోవడం లేదు. మొన్ననే కొత్త మేడం వచ్చారు.. చూశారు వెళ్లారు.. త్వరలో నీళ్లు వస్తాయని చెప్పారు. పక్క ఊరు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నాం. పాల్వంచ పట్టణానికి దగ్గరగా ఉన్నప్పటికీ మా ఊర్లో నీరు లేదు. ఏమిటి అంటే రైల్వేవాళ్లు పైపులైన్ వెయ్యనివ్వడం లేదంటున్నారు. అధికారులు కనికరం చూపి కనీసం వేసవిలోనైనా ట్యాంకర్‌తో నీరు అందిస్తే చాలు.
కూలీ చేస్తే గాని పూట గడవని మాకు నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తున్నది. అధికారులంతా మా గ్రామం నుంచే వెళతారు. ఆగుతారు.. చూస్తారు.. నీరు ఇవ్వండి సారూ అని అడిగితే వస్తుందని చెబుతున్నారు. మరి ఎప్పుడిస్తారో తెలియడం లేదు. వచ్చినప్పుడల్లా అందరం కలిసి అడుగుతున్నాం. తాగడానికి చుక్కనీరు కూడా మా గ్రామంలో లేదు. ఇప్పటికీ మేము చేతిపంపు దగ్గరకు వెళ్లి ఇంట్లో అవసరాలకు వాడుకునేందుకు నీరు తెచ్చుకుంటున్నాం.