భద్రాద్రి కొత్తగూడెం, జూలై 20 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లాలో మూగజీవాల వేదనలు అరణ్య రోదనలే అవుతున్నాయి. జబ్బుచేసిన పశువులను చూసేందుకు వైద్య సిబ్బందిలేని, ఇచ్చేందుకు మందుల్లేని దయనీయ స్థితి. భద్రాద్రి జిల్లాలోని 80 పశువైద్యశాలల్లో 40 ఆసుపత్రులకు అసలు భవనాలే లేవు. మిగిలిన ఉన్న భవనాలు కూడా అత్యంత శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ధైర్యంచేసి అందులోకి వెళ్లలేని స్థితి. జిల్లాలోని పశువులకు వైద్య సేవలందించేందుకు తీవ్రమైన వైద్య సిబ్బంది కొరత. వైద్యులు, కాంపౌండర్లతోపాటు చివరికి అటెండర్లు కూడా లేని దుస్థితి. అక్కడో ఇక్కడో ఉన్న వైద్య సిబ్బంది ఒకటో రెండో పశువులకు వైద్యమందించాలన్నా.. ఆసుప్రతుల్లో పూర్తిస్థాయిలో మందులుండని పరిస్థితి. ఒకవేళ ఆ వైద్య సిబ్బంది రాసిచ్చిన చిట్టీలు తీసుకొని బయటి మందుల షాపులకెళ్తే ఆయా పశువుల యజమానుల జేబులు గల్ల అయ్యే స్థితి. మొత్తంగా జిల్లాలోని పశువులకు వైద్య సేవలంటేనే అత్యంత దైన్యస్థితి.
జిల్లాలో మూగజీవాలకు అందాల్సిన వైద్య సేవలు గడిచిన రెండేళ్లుగా అందని ద్రాక్షలానే మిగిలాయి. పశువుకు ఏదైనా జబ్బు చేస్తే.. దానిని తీసుకొని దాని యజమాని పశువైద్యశాలకు వస్తే.. అక్కడ వైద్యులే ఉండరు. దీంతో చావుబతుకుల మధ్య ఉన్న తన పశువును కాపాడాలంటూ దాని యజమానికి భగవంతుడికి మొర పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ మొర ఆలకించి అక్కడికి ఏ కాంపౌండరో, అటెండరో వచ్చినా ఆ పశువుకు అందించేందుకు అటు సూదులుగానీ, ఇటు మందులుగానీ లేని దైన్యం. ఏదైనా దయతలిచి ఆ కాంపౌండరో, అటెండరో మందుల చిట్టీ రాస్తే దానిని తీసుకొని సదరు పశువుల యజమాని ప్రైవేటు మెడికల్ షాపుల వద్దకు పరుగులు తీయాల్సిన దారుణమైన పరిస్థితి.
అయితే, వర్షాకాలం సీజన్లో వచ్చే వైరస్‌లకు సరైన వైద్యం అందక ప్రాణాలు విడుస్తున్న పశువులకు గణాంకాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామంలో ఉన్న పశువైద్యశాఖ శిథిలావస్థకు చేరింది. కానీ అక్కడ డాక్టర్ లేరు. జీవాలకు జబ్బులు వస్తే అటెండర్ తప్ప అక్కడ ఎవరూ దిక్కులేరు. ఇలాంటి పరిస్థితి అక్కడ ఒక్కచోటే కాదు.. జిల్లా మొత్తానిది. జిల్లాలో ఉన్న 80 ఆసుపత్రుల్లో 40 మంది మాత్రమే వైద్యులు ఉన్నారు. దీంతో మిగిలిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడం ఎంతటి కష్టమో ఇదే ఉదాహరణ.
భద్రాద్రి జిల్లాలో 6 ఏడీ స్థాయి ఆసుపత్రులున్నాయి. కానీ, అక్కడ కూడా వైద్యుల్లేరు. దీంతో అక్కడ పశువైద్య సేవలు అందడం లేదు. భద్రాచలం, ఇల్లెందు తప్ప పాల్వంచ, కొత్తగూడెం, అశ్వారావుపేట, బూర్గంపహాడ్ మండల కేంద్రాల్లో ఏడీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో సిబ్బంది ఉన్నా లేనట్లే లెక్క. ఉదయం పది గంటలు దాటినా అక్కడికి సిబ్బంది రారు. ఒకవేళ డాక్టర్ ఉన్నా ఆయన కూడా సమయానికి వస్తారో రారో తెలియదు. మనుషులకు ఏదైనా జబ్బు చేస్తే క్షణాల్లో ఆటో పిలిపించుకొని ఏదైనా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. మరి పశువులను అలా తీసుకుళ్లే పరిస్థితి ఉండదు. అష్టకష్టాలు పడి పశువులను తీసుకొని వచ్చినా అక్కడ సరైన వైద్యం అందుతున్న పరిస్థితి లేదు.
జిల్లాలో 80 ఆసుపత్రులు ఉన్నాయి. అందులో 40 ఆసుత్రులు పాతవే. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఉన్న వైద్యులు తప్పని పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక వెటర్నరీ ఆసుపత్రులు 30 ఉండగా అందులో 27 చోట్ల మాత్రమే డాక్టర్లు ఉన్నారు. మిగతా డాక్టర్లు ఏడీ స్థాయి ఆసుపత్రుల్లో పనిచేస్తూనే మరో మూడు చోట్ల ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు. 44 సబ్సెంటర్లలో 24 మంది కాంపౌండర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అదేగాక 37 మంది అటెండర్లు కూడా ఖాళీగా ఉండడంతో ఆసుపత్రుల్లో పశువులకు వైద్యం అందడం లేదు. అన్ని ఆసుపత్రులూ శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ సిబ్బంది కూడా పనిచేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.
వర్షం వస్తే కురవడంతో పాటు పురాతన భవనాలు ఉండడం వల్ల పశువుల యజమానులు ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కూడా భయపడుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్లను బతిమిలాడుకుని ఇంటి వద్దకే పిలుచుకుని ప్రైవేటు మందులు కొనుగోలు చేసుకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. సీజన్ వస్తే గురక వ్యాధికి వ్యాక్సిన్ వేయడం తప్ప మరేమీ లేదు. ఇతర వ్యాధులు వచ్చినా, ప్రమాదాలు జరిగినా, పాములు కరిచినా మందులు లేకపోవడంతో ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడీ స్థాయి ఆసుపత్రులు కూడా బూర్గంపహాడ్, ఇల్లెందు ఆసుపత్రులు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎర్రగుంట, కొమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, సంగెం, గుండెపూడి, కొమ్ముగూడెం, నెల్లిపాక బంజర, అశ్వారావుపేట, గండుగలపల్లి, మందలపల్లి, మల్కారం, సున్నంబట్టి, వినాయకపురంతోపాటు ఇంకా పదుల సంఖ్యలో ఆసుపత్రులు శిథిలావస్థలో ఉన్నాయి.
మాఊరిలో ఆసుపత్రి మూలనపడింది. బాగు చేసేవారు లేరు. అసలు డాక్టరే లేరు. పశువులకు రోగాలు వస్తే మాకు మేమే మందులు తెచ్చుకుని బాగు చేసుకుంటున్నాం. జీవాలు బతికితే బతికినట్లు. లేకపోతే పోయినట్లే. మూగజీవాలు అంటే ఎవరికైనా అలుసే. ఎన్నోసార్లు చెప్పాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. ముందు డాక్టర్‌ను నియమిస్తే బాధలు తెలుస్తాయి.
-కొడాలి సూర్య ప్రకాశ్‌రావు, నెల్లిపాక, అశ్వాపురం
గ్రామాల్లో సబ్ సెంటర్లు పెట్టారు కానీ అక్కడ మందులు లేవు. వైద్యం ఉండదు. రోగాలు వస్తే మూగజీవాలకు మా జేబులు ఖాళీ అవుతున్నాయి. బయట చాలా ఖరీదైన మందులు ఉంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా మందులు లేకుండా చాలా ఇబ్బంది అవుతోంది. పాల ఉత్పత్తులు కావాలంటారు. కానీ పశువులకు వైద్యం అందించరు.
-ఈర్ల నవీన్, బేతంపూడి, టేకులపల్లి
ప్రభుత్వం పంపిన మందులను మాత్రమే పశుయజమానులకు ఇస్తున్నాము. పెద్ద జబ్బులు తగ్గాలంటే బయట మందులు తీసుకోవాలి. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. నాలుగు చోట్ల ఏడీలు లేరు. కాంపౌండర్లు, అటెండర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త భవనాలు ఉండాలి. వైద్యుల పోస్టులు భర్తీ కావాలి. మందుల కొరత లేదు. ప్రతీ సీజన్లో వ్యాక్సినేషన్ జరుగుతోంది.
-డాక్టర్ బీజమల్లయ్య, జిల్లా ఇన్చార్జి పశువైద్యశాఖ అధికారి