చండ్రుగొండ, మార్చి 15 : చండ్రుగొండ మండల రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పదేళ్ల తరువాత మళ్లీ ఆయిల్ ఇంజిన్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు కర్షకులు భగీరథ యత్నాలు చేయాల్సి వస్తోంది. ఇదివరకే తెగిన అలుగుకు కాంగ్రెస్ సర్కారు మరమ్మతులు చేయని ఫలితం.. అన్నదాతలకు శాపంగా మారింది.
రూ.వేలకు వేలు వెచ్చించి లీటర్లకు లీటర్లు ఆయిల్‌ను కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇంజిన్లు నడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిలోమీటర్ల మేర పైపులు ఏర్పాటు చేసుకొని పంటలకు నీటిని సరఫరా చేసుకోవాల్సిన దయనీయ దుస్థితి వచ్చింది. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలోని వెంగళరావు ప్రాజెక్టు ఈ వేసవిలో ఎండిపోయింది. దీంతో దీని ఆయకట్టు పరిధిలో రైతులకు సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి.
తెగిపోయిన ప్రాజెక్టు అలుగుకు మరమ్మతులు చేయించి కర్షకులకు సాగునీళ్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఈ కారణంగా ఆయకట్టు రైతులు ఈ యాసంగిలో సాగు చేయాల్సిన సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఆయకట్టు కింద ఈ యాసంగిలో మొత్తం 1,300 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా.. కేవలం 300 ఎకరాల్లోనే రైతులు వరి పంటను సాగుచేస్తున్నారు. ఇంత గణనీయంగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడమే సాగునీటి కొరత సమస్యలను తెలియజేస్తోంది.
తెగిన అలుగుకు ప్రభుత్వం మరమ్మతులు చేయకపోవడంతో ఆయకట్టు రైతులు కూడా పంటల విస్తీర్ణాన్ని తగ్గించారు. ప్రాజెక్టులో వినియోగించుకునేందుకు అవకాశం ఉన్న మేరకే వరి పంటను వేశారు. కానీ గత నెల రోజుల నుంచి తూము వరకు కూడా నీళ్లు రాలేదు. పైగా ఎడమ కాలువ ఎండిపోయింది. దీంతో రైతులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. దీంతో పంటలను కాపాడుకునేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. గడిచిన పదేళ్లుగా దూరం పెట్టిన ఆయిల్ ఇంజిన్లను మళ్లీ తెచ్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో సాగునీరు ఆలస్యమైన కారణంగా ఇప్పటికే 50 ఎకరాల మేర వరి పైరు ఎండిపోయింది. ఆ పంటను చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మిగిలిన పంటలనైనా కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఎకరానికి రూ.35 వేల వరకు అప్పులుచేసి మరీ పెట్టుబడులు పెట్టారు. అయినప్పటికీ మరోవైపు పంటలు ఎండిపోతూనే వస్తున్నాయి. కొన్నిచోట్ల చేతికొచ్చే సమయంలో పంట ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గత కేసీఆర్ పాలనలో గడిచిన పదేళ్లుగా పుష్కలంగా నీళ్లు పారిన కాలువలు నేడు నెర్రెలు వారి కన్పిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎండిపోయిన ప్రాజెక్టును, కాలువలను, పంట పొలాలను చూసి తల్లడిల్లిపోతున్నారు.
నేను కూడా మూడు ఎకరాల వరి పంట సాగు చేస్తున్నాను. ప్రాజెక్టు నుంచి నీళ్లు అందక పంట ఎండిపోతోంది. మాగాణి నెర్రెలు వారుతోంది. చూస్తే బాధ వేసింది. అందుకే పంటను కాపాడుకునేందుకు నీళ్లు కట్టాలనుకున్నా. ప్రాజెక్టులో నీరు ఉన్న చోటు వరకూ ఆయిల్ ఇంజిన్‌ను భుజాలపై మోసుకుంటూ వెళ్లాను. రూ.వేలకు వేలు ఖర్చు చేసి లీటర్లకు లీటర్లు ఆయిల్ పోసి ఇంజిన్లను నడుపుతున్నా. ఖర్చులు ఇంతలా పెరిగినా పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు.
-చింతల భద్రయ్య, రైతు, దామరచర్ల, చండ్రుగొండ
నేను నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టాను. కానీ నీళ్లు అందక ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. అలుగు తెగిన కారణంగా వెంగళరావు ప్రాజెక్టులో ఈ వేసవిలో నీళ్లు లేవు. అడుగున ఉన్న నీటిని వినియోగించుకొని కొంత మేరకు పంటలను కాపాడుకోవాలనుకున్నాం. నేనైతే రోజుకు ఐదు లీటర్ల ఆయిల్ తెచ్చి ఇంజిన్‌లో పోసి నడిపించుకుంటున్నా. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు ఇంతకుమించిన మార్గం లేదు.
-బొమ్మకంటి చెన్నారావు, ఆయకట్టు రైతు, దామరచర్ల, చండ్రుగొండ