పాల్వంచ, అక్టోబర్ 17: కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు గెలుపునకు బాటలు వేస్తామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పాత పాల్వంచలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నివాసంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బు సంచులతో వచ్చే దొంగలను కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు విశ్వసించరన్నారు. గత ఎన్నికల్లో వనమా చేతిలో ఘోరంగా ఓడిపోయిన జలగం వెంకట్రావ్ ఇప్పుడు ఢిల్లీ, హైదరాబాద్‌లలో కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. జలగం వెంకట్రావ్ గొప్పలకు పోతే సీఎం కేసీఆర్ ఆయన పగటి కలల్ని పటాపంచలు చేశారన్నారు.
సీనియర్ ఎమ్మెల్యేగా వనమాకు సీఎం కేసీఆర్‌కు ఎనలేని ఆదరాభిమానాలు ఉన్నాయన్నారు. పార్టీ నాయకులు బయట వినిపిస్తున్న పుకార్లు, వదంతులను నమ్మొద్దని సూచించారు. సంపద సృష్టించి పేదలకు పంచడమనే గొప్ప ఆశయంతో కేసీఆర్ పాలన సాగించారని, కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. వచ్చే నెల 5న కొత్తగూడెంలో జరిగే సీఎం కేసీఆర్ సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్పర్సన్ దామోదర్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సర్దార్ పుటం పురుషోత్తం రావు, కొత్వాల శ్రీనివాసరావు, రాంబాబు, వాసుదేవరావు, కాసుల వెంకట్, జేవీఎస్ చౌదరి, రాజుగౌడ్, హనుమంతరావు, రజాక్, బత్తుల వీరయ్య, సోమిరెడ్డి పాల్గొన్నారు.