ఖమ్మం, సెప్టెంబర్ 1 : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందున తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
వరదలతో నలుగురు మృతిచెందడంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. నగరంలో వందలాది ఇండ్లు వరద ముంపునకు గురయ్యాయని, వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని వెంటనే ఆదుకోవాలని ఢిల్లీలోని రక్షణ శాఖ అధికారులను కోరినట్లు వద్దిరాజు తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ.. విశాఖపట్నంలోని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
నౌకాదళ హెలికాప్టర్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేయనున్నట్లు సమాచారం. కాగా.. నిరాశ్రయులైన వారికి షెల్టర్లు ఏర్పాటు చేయాలని, ఆహారం, తాగునీరు అందించాలని, దెబ్బతిన్న రైల్వే ట్రాక్, రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపీ రవిచంద్ర కోరారు.