కొత్తగూడెం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేస్తే విజయం మనదేనని కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని తన నివాసంలో నియోజకవర్గలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల ప్రణాళికపై శుక్రవారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ అందరి అభిప్రాయాలతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని, సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.
గత కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం, జిల్లాలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. చివరి రక్తం బొట్టు వరకు వనమా కుటుంబం రాజకీయాల్లో ఉంటుందని, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ముందుకు వెళదామన్నారు. సమావేశంలో నాయకులు కిలారు నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీలు భూక్యా సోనా, బాదావత్ శాంతి, సరస్వతి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కనగాల బాలకృష్ణ, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, కొట్టి వెంకటేశ్వర్లు, అన్వర్పాషా, బట్టు మంజు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.