ఇల వైకుంఠపురం
అల వైకుంఠ పురం.. ఇల సాక్షాత్కరించింది. ముక్కోటి ఏకాదశి పర్వ దినాన భద్రగిరి వైకుంఠాన్ని తలపించింది. ‘ఉత్తర ద్వారం ఎప్పుడు తెరచుకుంటుందా.. తమ ఇలవేల్పును కన్నుల్లో నింపుకొందామా..’ అని భక్తులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఆ దివ్య క్షణాలు రానే వచ్చాయి.
- ఉత్తరద్వారంలో భద్రాద్రి రామయ్య దర్శనం
- వైకుంఠ రాముడిగా భక్తులకు అనుగ్రహం
- తిలకించి తరించిన భక్త జనం..
- గౌతమీ తీరం పావనం
- స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు
అల వైకుంఠ పురం.. ఇల సాక్షాత్కరించింది. ముక్కోటి ఏకాదశి పర్వ దినాన భద్రగిరి వైకుంఠాన్ని తలపించింది. ‘ఉత్తర ద్వారం ఎప్పుడు తెరచుకుంటుందా.. తమ ఇలవేల్పును కన్నుల్లో నింపుకొందామా..’ అని భక్తులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఆ దివ్య క్షణాలు రానే వచ్చాయి. ధూపాల ఘుమఘుమలు, దీపాల వెలుగు జిలుగులు, వేద మంత్రోచ్ఛారణ, మంగళవాద్యాల నడుమ సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు మెల్లగా ఆలయ ఉత్తర ద్వారం తెరుచుకున్నది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భద్రశైలవాసుడు గరుడ వాహనంపై ఆశీనుడైన రామయ్య, ఐశ్వర్యానికి ప్రతిరూపమైన గజవాహనంపై సీతమ్మ తల్లి, హనుమంత వాహనంపై లక్ష్మణస్వామిని దర్శించుకుని భక్తులు తరించారు. ‘జై శ్రీరామ్.. జై జై శ్రీరామ్’ అంటూ జయ జయధ్వానాలు చేశారు. వేదపండితులు చతుర్వేద పారాయణం, భగవద్రామానుజ శరణాగతి గద్య పఠనం చేశారు. భక్తుల రాకతో భద్రాద్రి భక్తజన సంద్రమైంది. గోదావరి తీరం పులకించింది.
అల వైకుంఠం ఇలకు దిగి వచ్చెను.. భద్రాద్రి రాముడు వైకుంఠ
రాముడయ్యెను.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులను అనుగ్రహించెను.. అందుకు భద్రాచలం రామాలయ ప్రాంగణం వేదికైంది.. సోమవారం తెల్లవారుజామున సరిగ్గా 5 గంటలకు ఆలయ ఉత్తర ద్వారం తెరుచుకున్నది..
‘జై శ్రీరామ్.. జై జై శ్రీరామ్’ అంటూ భక్తులు జయ జయధ్వానాలు చేశారు. వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు..
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం (జనవరి 2): భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ‘జై శ్రీరామ్.. జై జై శ్రీరామ్’ అంటూ జయ జయధ్వానాలు చేశారు. వేదపండితులు ముక్కోటి విశిష్టతను వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీవీఐపీ, వీఐపీతో పాటు ఇతర సెక్టార్లలో భక్తులు కూర్చొని వేడుకను తిలకించారు. స్థానాచార్యులు భక్తులకు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. అర్చకులు 108 ఒత్తులతో వెలిగించిన హారతి అందుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం తర్వాత ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బందోబస్తును ఎస్పీ వినీత్ గంగన్న పర్యవేక్షించారు. వేడుకలను జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, హరిప్రియ, ఆరూరి రమేశ్, రాములునాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం ఆర్డీవో రత్నకల్యాణి, ఏఎస్పీ రోహిత్రాజు, ఓఎస్డీ సాయిమనోహర్, అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఈవో బానోతు శివాజీ వీక్షించారు.

ప్రత్యేక పూజలు
గరుడ వాహనరూపుడైన రామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి విశేష ఆరాధన, శ్రీరామ పదాక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వేదాలు, గరుడ ప్రబంధాలు, ఇతిహాసాలు, శరణాగతి గజ్జగరుడ దండం, భక్తరామదాసు రచించిన దాశరథి శతకాన్ని పఠించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శతహారతినిచ్చారు. భక్తరామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాసయాదవ్ మూలవరులకు స్నపనం నిర్వహించారు.
వైభవంగా తిరువీధి సేవ…
ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం వైకుంఠరాముడు తిరువీధి సేవకు తరలివెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరోవాహనంపై ఆండాళమ్మ వారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజవాహనంపై సీతమ్మ వారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తుల తిరువీధి సేవ సాగింది. మేళతాళాలు, భాజా భజంత్రీలు, వేదమంత్రోచ్ఛారణ మధ్య శోభాయమానంగా సాగింది.
రాపత్తు ఉత్సవాలు ప్రారంభం…
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం నాటికి పగల్పత్తు ఉత్సవాలు ముగిశాయి. సోమవారం రాత్రి స్వామివారికి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకలకు మన రాష్ట్రం నుంచే కాక ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఉత్తరద్వార దర్శనం విజయవంతం: కలెక్టర్
ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యం లో నిర్వహించిన ‘ఉత్తర ద్వార దర్శనం’ విజయవంతమైందని కలెక్టర్ అనుదీప్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమన్వయంతో పనిచేసి భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసిన పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ, ఆలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కవరేజీకి విచ్చేసిన పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

