భద్రాచలం, జనవరి 10: తెల్లవారుజామునే వేద పండితుల మంత్రోచ్ఛారణలు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల ఎదురుచూపులు. ఆ అమృత ఘడియ రానే వచ్చింది. అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. అలంకృతుడైన భద్రాద్రి రామయ్య వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఒక్కసారిగా జయజయ ధ్వానాలు.. ‘జై శ్రీరామ్ జైజై శ్రీరామ్’ అంటూ భక్తిభావంతో నినాదాలు. శుక్రవారం తెల్లవారుజామున పవిత్ర పావన గోదావరి నదీతీరం నుంచి అర్చకులు తీర్థపు బిందెను తీసుకొచ్చారు.
ఆలయ సంప్రోక్షణ చేసిన తర్వాత స్వామివారికి ఆరాధన, ఆరగింపు చేశారు. సంప్రదాయబద్ధంగా తహసీల్దార్‌కు ఆలయ మర్యాదలు చేశారు. పూలతో అలంకరించిన గరుడ వాహనంపై శ్రీరాముడు, గజవాహనంపై సీతమ్మ వారు, హనుమత్ వాహనంపై ఆంజనేయస్వామి, మరికొన్ని వాహనాలపై ఆండాళ్లు అమ్మవారు, ఆళ్వార్లను ఆశీనులను చేసి ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం వద్దకు చేరుకుని స్వామివారి దర్శనం కోసం వేచిచూస్తున్నారు.
ఈలోగా ఘల్లుఘల్లు మంటూ గంటలు మోత మోగుతుండగా.. భాజాభజంత్రీల సందడి.. వేదపండితుల మంత్రోచ్ఛరణలు మిన్నంటుతుండగా ఒక్కసారిగా ఆలయ ఉత్తర ద్వారం తెరుచుకున్నది. స్వామివారిని తనివితీరా వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. శ్రీరామ.. జయరామ.. జయజయరామ అంటూ ఆధ్యాత్మిక సంద్రంలో మునిగితేలారు. వేదపండితులు, అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, తిరువారాధన, వేదవిన్నపం, శ్రీరామసంపుటి పఠించారు. ఆద్యంతం ఈ వేడుకను కనులారా తిలకించిన భక్తజనం పులకించిపోయారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు.
ఉదయం 11 గంటల సమయంలో స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ కలెక్టర్లు జితేశ్ వి పాటిల్, ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఆర్డీవో దామోదరరావు, ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.