ఖమ్మం, ఏప్రిల్ 3 : హెచ్‌సీయూ భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు చేసే ప్రయత్నాలను నిలువరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
భూముల పరిరక్షణ అవసరం గురించి ఇటీవల రాజ్యసభలో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర.. బుధవారం సహచర ఎంపీలు, బీఆర్ఎస్ నాయకులతోపాటు సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. అలాగే, గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో భూముల అంశాన్ని ఆయన తిరిగి లేవనెత్తారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవాలని చూసినా వెనుకడుగు వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు వైఖరిని ఎండగట్టారు. ఆ భూమిని కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వంతోపాటు మనందరిపై ఉందన్నారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని, ఈ భూములను వేలం వేయకుండా చూడాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.