ఖమ్మం సిటీ, జూలై 9:తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు మరో అరుదైన అవకాశం దక్కింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళం విప్పుతున్న ఆయన తీరును గుర్తించి అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. వద్దిరాజు రవిచంద్ర ప్రసుత్తం ఉప నేతగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న కేఆర్ సురేశ్‌రెడ్డి పదవీకాలం ఇటీవల పూర్తికావడంతో ఆయన స్థానంలో రవిచంద్రకు బాధ్యతలు అప్పగించారు.
ఈయన పదవీకాలం 2030 వరకు ఉంది. దాంతోపాటు పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా, బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా కూడా వద్దిరాజు ఉన్నారు. కాగా, తనను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేసినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు రవిచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన తనను రాజ్యసభకు రెండు దఫాలుగా పంపడమే కాకుండా పార్లమెంటరీ నేతగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేశారు. తనపై అధినేత కేసీఆర్ ఉంచిన గురుతర బాధ్యతను వినమ్రంగా స్వీకరించి, గౌరవిస్తూ తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్లో బలంగా వినిపిస్తానని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు ఖమ్మంలో అభినందనలు వెల్లువెత్తాయి. గులాబీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఖమ్మంలో గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, పగడాల నరేందర్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమర్థవంతమైన పాత్ర పోషిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా రవిచంద్రకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తన సందేశాన్ని పంపారు.