అన్నదాతల ఆరుగాలం కష్టమంతా నీటిపాలైంది. ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నలకు కన్నీటి వ్యథను మిగిల్చింది. చేతికందిన పంటలు వర్షార్పణమయ్యాయి. అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉంచిన మొక్కజొన్నలు, వడ్లు కళ్ల ముందే తడిసి ముద్దయ్యాయి. ప్రకృతి వైపరీత్యం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కానీ, ఫలితం లేకుండాపోయింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంటలను సోమవారం రైతులు బాధాతప్త హృదయాలతో ఆరబెట్టారు.
పంటలను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం సకాలంలో ఆ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. లారీలు లేవు.. గన్నీబ్యాగులు లేవు.. హమాలీలు రావడం లేదు అంటూ కాంటాలు పూర్తిచేయకపోవడంతో రైతులు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగాలం శ్రమించే రైతులకు పంట డబ్బులు చేతికందే వరకూ దిగులు తప్పడం లేదు. ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలతోపాటు మరికొన్ని మండలాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. వేలాది ఎకరాల్లో పండించిన పంటలు తీరా చేతికొచ్చి కాంటాలు వేసే సమయంలో నీటిపాలయ్యాయి. సుమారు 30 శాతంపైగా పంటలు ఇంకా రోడ్లపై, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి.
భయంకరమైన ఎండల్లోనూ రైతులు పంటలకు కాపలా ఉంటూ కాంటాలు కోసం వేచిచూస్తున్న క్రమంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం అందరి ఆశలపై నీళ్లు చల్లింది. మధ్యాహ్నం వరకు మంచిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను సోమవారం ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా.. వారి బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన సమస్య. 15 రోజులుగా ఆరబెట్టుకున్న ధాన్యం బస్తాలు రాకపోవడంతో వరదకు కొట్టుకుపోయిందని కూసుమంచి మండలం లింగారంతండా రైతు బానోత్ కిరణ్కుమార్ అనే రైతు తన బాధను వ్యక్తం చేశారు.
కాంటాలు వేస్తామంటూ అధికారులు చేసిన ఆలస్యంతో వారం రోజులుగా కల్లాల్లో ధాన్యం వద్ద కాపలా కాశామని.. తీరా నష్టపోయామని నీలమ్మ అనే కోక్యాతండా మహిళా రైతు తెలిపారు. రోడ్ల వెంట ఎక్కడ చూసినా వేలాది క్వింటాళ్ల ధాన్యం, మక్కలు ఆరబెట్టిన రాసులు, బస్తాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంటాలు వేసే హమాలీలు రాకపోవడం, బస్తాలు దించేవారు తక్కువ మంది ఉండటం వల్ల రోజుకు 25 లారీల సరుకు తరలించినా వారం రోజులపాటు తరగని ధాన్యం, మొక్కజొన్నలు రైతుల వద్ద ఉన్నాయి.
ధాన్యం కాంటాలు కావడం లేదని కుప్పగా పోసిన ధాన్యం కొనటానికి వచ్చిన వ్యాపారి మొఖం చాటువేయడంతో కిష్టాపురానికి చెందిన కొండపల్లి కృష్ణారావు అనే రైతు భార్య హైమావతి ఆవేదనతో హైబీపీతో అనారోగ్యానికి గురైంది. ధాన్యం, మొక్కజొన్నలు కాంటాలు కాకపోవడం, హమాలీల కొరత, లారీలు రాకపోవడం, దిగుమతి కాకపోవడం, గోదాంలు లేకపోవడం వంటివి ప్రధాన సమస్యలుగా వేధిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతన్నలు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Khammam
మొక్కజొన్న మొత్తం తడిసింది..
రెండెకరాల్లో యాసంగి పంటగా మొక్కజొన్న వేశా.. ఆదివారం కురిసిన అకాల వర్షానికి పట్టాల్లోకి నీరు చేరడంతో మక్కలు మొత్తం తడిశాయి. పంట కోసి 10 రోజులుగా కాంటాల కోసం ఎదురుచూస్తున్నాం.. కానీ, కాంటాలు కాలేదు. బస్తాలు రాలేదు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడం చూసి తట్టుకోలేకపోతున్నాం. అరిగోసగా ఉంది మా పరిస్థితి. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.
-కొక్కిరేణి విశ్వనాథం, కిష్టాపురం, కూసుమంచి
పావు పంట నీటిలో కొట్టుకుపోయింది..
నాలుగెకరాల్లో వరి పంట వేశా.. మిషన్ కోయిస్తే 18 డబ్బాల ధాన్యం వచ్చింది. తేమశాతం వచ్చినా 10 రోజులుగా బస్తాలు లేక కాంటాలు కాలేదు. దీంతో పంటను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నాం. ఆదివారం వర్షం రావడంతో పావలా వంతు ధాన్యం కింద ఉన్న పొలాల్లోకి కొట్టుకుపోయింది. వచ్చి కాపాడుకుందామన్నా.. భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. తీరా వర్షం తగ్గినాక వస్తే అంతా నీటిపాలైంది.
-బానోత్ కిరణ్కుమార్, లింగారంతండా