ఇల్లెందు రూరల్/కారేపల్లి/చుంచుపల్లి/ములకల పల్లి/చండ్రుగొండ, మే 19 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం విషాదాన్ని మిగిల్చింది. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ వర్షం కారణంగా పడిన పిడుగుల వల్ల ఇల్లెందులో ఒకరు మృతి చెందారు. కారేపల్లిలో 20 మూగ జీవాలు మృత్యువాతపడ్డాయి. అలాగే, ఇల్లెందులో ఒకరు, కారేపల్లిలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వర్షం, గాలిదుమారం కారణంగా తెగిపడిన విద్యుత్ వైరు తగిలి చండ్రుగొండలో మూడు పశువులు మృతి చెందాయి. ఇక చుంచుపల్లి, ములకలపల్లి మండలాల్లో కురిసిన వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పాక్షికంగా తడిసింది. వర్షం మొదలుకాగానే రైతులందరూ పరుగు పరుగున వెళ్లి ధాన్యం రాసులపై టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.
పిడుగుపడి వ్యక్తి మృతి
ఇల్లెందు మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన పరిటాల పుల్లయ్య(45) సోమవారం తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న క్రమంలో వర్షం మొదలైంది. దీంతో చెట్టు పక్కన ఆగాడు. ఇంతలో ఆ సమీపంలోనే పిడుగుపడి పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఈ భీకర శబ్దానికి.. అతడి పక్కనే ఉన్న అతడి సోదరుడు పరిటాల వెంకన్న సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు గుర్తించి వెంకన్నను ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పుల్లయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
22 మూగ జీవాలు మృత్యువాత
కారేపల్లి మండలం పాటిమీదిగుంపు సమీపంలో సోమవారం సాయంత్రం పిడుగుపడింది. దీంతో అక్కడే ఉన్న సుమారు 20 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. బాజుమల్లాయిగూడేనికి చెందిన మద్దెల లక్ష్మయ్య-లక్ష్మి దంపతులు తమ గొర్రెలు, మేకలను మేత కోసం పాటిమీదిగుంపు సమీపంలోకి తోలుకెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తుండడంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు జీవాలను తోలారు. వారు కూడా అదే చెట్టు కింద ఉన్నారు.
ఈ క్రమంలో ఆ చెట్టుకు అతి సమీపంలో పిడుగు పడింది. దీంతో చెట్టు కింద ఉన్న 17 మేకలు, 4 గొర్రెలు, ఒక పెంపుడు కుక మృతిచెందాయి. ఆ పిడుగు ధాటికి మద్దెల లక్ష్మి స్పృహతప్పి పడిపోయింది. లక్ష్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపకల పొలాల వారు వచ్చి గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని లక్ష్మి-లక్ష్మయ్య దంపతులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
తడిసిన ధాన్యం..
చుంచుపల్లి, ములకలపల్లి మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. ఉదయం వేళ కాస్త పొడి వాతావరణం ఉండడంతో రైతులందరూ తమ ధాన్యాన్ని కల్లాల్లోనూ, కొనుగోలు కేంద్రాల్లోనూ ఆరబోశారు. మధ్యాహ్నం తరువాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం మొదలైంది. దీంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. పరుగుపరుగున వెళ్లి ధాన్యపు రాసులపై టార్పాలిన్లు కప్పినప్పటికీ కొద్దిమేర ధాన్యం తడిసింది. చుంచుపల్లిలో 20 రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే ఉండడం వల్లనే, ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లనే తమ ధాన్యం తడిసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ షాక్తో పశువులు మృతి
చండ్రుగొండ మండలం గానుగపాడు వాసి యెన్నం వెంకన్నకు చెందిన రెండు పాడి గేదెలు, సత్యనారాయణపురం వాసి భాగ్యరాజుకు చెందిన ఓ దుక్కిటెద్దు ఆదివారం మేతకు వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు మండలంలో గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. దీంతో గ్రామ శివారులోని రైల్వేలైన్ పక్కన రైతుల పొలాలకు వెళ్లే విద్యుత్ తీగ కిందపడి ఉంది. గమనించక తగలడంతో ఈ మూడు పశువులూ విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం వెతుకుతున్న క్రమంలో చనిపోయిన పశవులను సదరు రైతులు గుర్తించారు.